శాంతిభద్రతల పరిరక్షణలో కీలక భూమిక పోషించే పోలీసులు తమ భుజాలపై అధికార పార్టీ సొంత అజెండా మోయాల్సి వస్తోంది. ప్రభుత్వ సేవల్లో మునిగితేలిన ఫలితంగా విధి నిర్వహణలో తీవ్రవైఫల్యాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి లేదు.. భద్రత కానరాదు అంటూ ప్రజలు ఆవేదన చెందే పరిస్థితి దాపురించింది. శాంతిభద్రతలు అడుగంటడంతో ఆంధ్రప్రదేశ్ అభద్రత.. ఆందోళన.. ఆవేదనకు చిరునామాగా మారిపోయింది. సర్కారు ఘోర వైఫల్యాలతో పోలీసుల ప్రతిష్ట మసకబారుతోంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఇతర నేరాలు పెరిగిపోయాయి. మహిళలపై లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు రెట్టింపయ్యాయి. మైనర్ బాలికలపైన అత్యాచారాలు పెచ్చరిల్లాయి. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను మట్టుపెట్టడం, వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న నారాయణరెడ్డిని 2017 మేలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం దీనికి పరాకాష్ట.
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చారన్న అపఖ్యాతిని పోలీసులు మూటగట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న కత్తితో హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు, ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఘటన జరిగిన గంటకే డీజీపీ ఠాకూర్ స్పందించిన తీరు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉందని న్యాయ నిపుణులు సైతం తీవ్రంగా తప్పుపట్టడం గమనార్హం. సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వెకిలి వ్యాఖ్యలు సైతం కేసు దర్యాప్తుపై ప్రభావితం చూపాయి. ఈ కేసులో సిట్ కుట్ర కోణం వైపు దృష్టి పెట్టకుండా నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును పరిమితం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసును విచారిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎన్‌ఐఏకు సహకరించడం లేదు.
విమానాశ్రయంలోనూ నిర్బంధం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ 2017, జనవరి 26న విశాఖలో తలపెట్టిన కొవ్వొతుల నిరసనకు సంఘీభావంగా వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని విమానాశ్రయం రన్‌వేపైనే అడ్డుకున్న పోలీసుల తీరును ప్రజలు తప్పుబట్టారు. అమరావతిలో 2017 ఫిబ్రవరి 11న నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలో దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో రకరకాల ప్రాంతాల్లో తిప్పి హైదరాబాద్‌లో వదిలిపెట్టడం వివాదాస్పదమైంది. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడను ఇంటి నుంచి బయటకు రాకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలను పలుమార్లు అరెస్టులు చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది.
రాష్ట్రమంతా టెర్రర్..
రాజధాని అమరావతిలో తమ అడుగులకు మడుగులొత్తకపోతే బెదిరింపులు, అక్రమ కేసులతో ప్రభుత్వం టెర్రర్ పుట్టిస్తోంది. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని సైతం విస్మయానికి గురిచేశాయి. తమ మాట వినని రైతుల అరటి తోటలు, ఇతర పంట పొలాలు తగలబెట్టించిన టీడీపీ నేతలు భయాందోళనలు సృష్టించారు. తమ సమస్యలను పరిష్కరించాలని న్యాయపోరాటాలు చేసిన వివిధ వర్గాల ప్రజలను, ఉద్యోగులను ప్రభుత్వం పోలీసులతో అణచివేసింది. సర్కారు ఆదేశాలతో పోలీసులు సమస్యలపై నినదించిన ప్రజల గొంతు నొక్కేశారు. శాంతియుత నిరసనలు తెలిపినవారిపై లాఠీలు విరుచుకుపడ్డాయి. డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన పాపానికి అక్రమ కేసులు బనాయించారు. సీఆర్‌పీసీ 144, 151లతోపాటు పోలీస్ యాక్ట్ 30లను విచ్చలవిడిగా ప్రయోగించి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేశారు. మూడేళ్లుగా పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు పోలీసుల హడావుడితో ఉలిక్కిపడుతోంది. కాలుష్య కారక ఆక్వా ఫుడ్‌పార్కు వద్దని ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమాన్ని అణచివేస్తున్న పోలీసులు కేసులతో భయపెడుతున్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 11 ఏళ్లనాటి ప్యాకేజీనే ఇస్తామంటూ పోలీసులను ప్రయోగించి భయాందోళనలు సృష్టిస్తోంది. పోలవరం ప్రాజెక్టు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వని ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి పరిహాసం చేస్తోంది.
ఎన్‌కౌంటర్ల కలకలం..
రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లు పోలీసులపై కౌంటర్లు వేసేలా మారాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2015, ఏప్రిల్‌లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను కాల్చి చంపారు. వారిని పోలీసులే పట్టుకుని హత్య చేశారంటూ పౌరహక్కుల నేతలు ఆరోపణలు చేశారు. 2018, జూలై 25న పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల నడుమ మరోమారు కాల్పుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందాడు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో మల్కన్‌గిరి లో 2016, అక్టోబర్ 24 నుంచి నాలుగు రోజులపాటు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వారిలో 11 మందికి పైగా గిరిజనులు ఉండటం విమర్శలకు తావిచ్చింది. తాజాగా గతేడాది సెప్టెంబర్ 23న విశాఖ మన్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడంతో భద్రతా వైఫల్యం, నిఘా నీరుగారిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం చేపట్టింది.
కత్తులు దూస్తున్న రౌడీయిజం
రాష్ట్రంలో రౌడీయిజం కత్తులు దూస్తోంది. రాష్ట్రంలో రౌడీ, కేడీ, డెకాయిట్, సస్పెక్ట్ (హిస్టరీ) షీట్లు ఏకంగా 28,381 మందిపై ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అత్యధిక హిస్టరీ షీట్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లాలో 4,236 మందిపైన, గుంటూరు జిల్లాలో 3,984 మందిపైన హిస్టరీ షీట్లు ఉన్నాయి. దశాబ్ద క్రితం సద్దుమణిగిన రౌడీయిజం మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు, భూసెటిల్‌మెంట్లు, రాజకీయ ప్రత్యర్థుల హత్యలే లక్ష్యంగా వెర్రితలలు వేస్తోంది. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. గుంటూరులో మాజీ రౌడీషీటర్ బసవల వాసు (38) దారుణ హత్యకు గురైన తీరు సంచలనం సృష్టించింది.
పోలీస్‌స్టేషన్‌కు దగ్గరలోనే రెస్టారెంట్‌లో భోజనం చేసి బయటకు వచ్చిన వాసును స్కార్పియోలో వచ్చిన ప్రత్యర్థులు రెప్పపాటులోనే విచక్షణారహితంగా నరికేశారు. విజయవాడ సింగ్‌నగర్‌లో ఒక బార్ వద్ద రౌడీషీటర్ కట్లా వేణుగోపాలరావు అలియాస్ కల్నాయక్ కత్తులతో దాడి చేసి గంధసిరి వెంకటేశ్వరరావును హతమార్చాడు. రౌడీషీటర్ కల్నాయక్‌పై 20 ఏళ్లలో 16 కేసులు ఉండటంతో పోలీసులు నగర బహిష్కరణ విధించినప్పటికీ అతను నిర్భయంగా వచ్చి హత్య చేయడం గమనార్హం. కర్నూలు జిల్లా నంద్యాలలోని నడిరోడ్డుపై పట్టపగలే రౌడీషీటర్ రాఘవేంద్రను మరో రౌడీషీటర్ గుమ్మపాలెం బద్రి హత్య చేశాడు. విశాఖ మద్దిలపాలెంలోని సింగర్ బార్ వద్ద రౌడీషీటర్ మళ్ళ వెంకటరమణను తోటి రౌడీషీటర్ హతమార్చాడు.
మహిళలను అగౌరపరచడంలో టాప్
రాష్ట్రంలో మహిళలను కించపరచడం, వేధించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, కిడ్నాప్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక ప్రకారం.. మహిళలపై రాష్ట్రంలో 2016లో 16,362 నేరాలు జరగ్గా 2015లో 15,967 నేరాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 8వ స్థానంలో ఉండటం గమనార్హం. మహిళల అక్రమ రవాణాలోనూ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఐదు, ఎస్టీలపై నేరాల్లో నాలుగు, ఆర్థిక నేరాల్లో పది, సైబర్ నేరాల్లో ఆరో స్థానంలో ఉంది. మొత్తం నేరాలన్నింటిలో కలిపి ఏపీ 13వ స్థానంలో ఉంది.
రైల్వే నేరాల్లో ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్
రైల్వే నేరాల్లో దేశంలో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. ఇటీవల జాతీయ నేర నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించిన నేరాల చిట్టా చూస్తే విస్తుపోవాల్సిందే. 2016లో జరిగిన రైల్వే నేరాలను గమనిస్తే.. ఏపీలో రైళ్లలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, స్మగ్లింగ్ హడలెత్తిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) పరిధిలో 2014లో 1,786 కేసులు, 2015లో 1,809 కేసులు, 2016లో 1,893 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని రైళ్లలో గంజాయి, బంగారం, సుంకం చెల్లించని విలువైన సామాగ్రి స్మగ్లింగ్ జరుగుతున్న తీరు పోలీసులకు సవాలుగా మారింది.
బెట్టింగ్‌లకు బ్రేక్ పడలేదు..
రాష్ట్రంలో పెద్దఎత్తున సాగుతున్న బెట్టింగ్ మాఫియాకు బ్రేక్ పడటంలేదు. క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో పోలీసులు కన్నెత్తి చూడటంలేదు. బెట్టింగ్‌లు వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చంద్రబాబు గత పాలనలో హైదరాబాద్‌లో మొదలైన క్రికెట్ బెట్టింగ్‌లు క్రమంగా రాష్ట్రమంతా విస్తరించాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు బెట్టింగ్‌ల కోసం ప్రత్యేకంగా బుకీలున్నారు. చిన్నపాటి పాన్‌షాపుల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకు బుకీలకు నిలయాలుగా మారిపోయాయి. రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన పలువురి అతిథిగృహాలు క్రికెట్ సీజన్‌లో బుకీలకు విందు, మందు, పొందుతో ఆతిథ్యమిచ్చే షెల్టర్‌జోన్‌లుగా మారిపోతున్నాయి. చివరకు ముంబైలోని అండర్‌వరల్డ్ డాన్‌ల వరకు అండదండలు ఉండటంతో బెదిరింపులు, కిడ్నాప్‌లకు బెట్టింగ్‌లు దారితీస్తున్నాయి. పేకాట శిబిరాలకు కూడా టీడీపీ నేతలే నిర్వాహకులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
రెచ్చిపోతున్న ‘పచ్చ’ నేతలు
- విశాఖపట్నం, గన్నవరం విమానాశ్రయాల్లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్కడి సిబ్బందిపై వీరంగం సృష్టించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఆయన తమ్ముడు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గతంలో తమ దివాకర్ ట్రావెల్స్ బస్సును ఆపారన్న ఉక్రోశంతో హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారిని కొట్టడం పెనుదుమారం సృష్టించింది. తాజాగా అనంతపురం జిల్లాలోని ప్రబోధానంద ఆశ్రమంపై జేసీ అనుచరుల దాడి ఉద్రిక్తతకు దారితీసింది.
- నిజాయితీగా విధులు నిర్వర్తించిన మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడిచేసినప్పటికీ ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పచ్చపాతం చూపింది. సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్న చింతమనేని అధికారులు, పోలీసులు, కార్మికులు, విలేకరులు, రాజకీయ నాయకులపై దాడులపర్వాన్ని కొనసాగిస్తున్నారు.
- విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడటంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసినా ఎలాంటి కేసులు, క్రమశిక్షణా చర్యలూ లేవు.
- పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం ఎస్‌ఐ శ్రీనివాస్, రైటర్‌ను నిర్బంధించి దుర్భాషలాడిన టీడీపీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మరో ఎనిమిది మందిపై తçప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేసినా చట్టపరమైన చర్యలు లేవు.
- నెల్లూరులో సీఐని తాట తీస్తానంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుర్బాషలాడినా ఎలాంటి చర్యలూ లేవు.
- పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనచైతన్య యాత్ర సమయంలో ఫుడ్‌పార్కు విషయంలో నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
- స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం తన అనుచరులతో నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే కాంట్రాక్టర్ పర్సంటేజీ(మామూళ్లు) ఇవ్వలేదనే కారణంతో దాడి చేసి వర్క్‌షాపు షెడ్డును కూల్చేసి, సామాగ్రిని ధ్వంసం చేసి ఎదురుకేసులు పెట్టిన ఘటన విమర్శలకు తావిచ్చింది.
- అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లిలో సుధమ్మ అనే మహిళపై టీడీపీ గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుడు చంద్ర మూకుమ్మడిగా దాడి చేసి దారుణంగా కొట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.
ఎర్రచందనం స్మగ్లింగ్.. గంజాయి సాగు
అటు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇటు ఏవోబీలో గంజాయి సాగు పోలీసులకు సవాలుగా మారాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసినప్పటికీ అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మరోవైపు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని అరికట్టడంలోనూ ఇదే కథ. గంజాయి తోటలను ధ్వంసం చేస్తామంటూ మూడేళ్లుగా కార్యాచరణ ప్రకటిస్తున్న పోలీసులు మిగిలిన శాఖలను సమన్వయం చేసుకోవడంలో ఫలితం సాధించలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి అమరావతికి, హైదరాబాద్‌కు, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ లకు గంజాయి స్మగ్లింగ్ అవుతున్నా చెక్‌పోస్టుల్లోని సిబ్బంది, ప్రత్యేక బృందాలు గంజాయి స్మగ్లింగ్‌ను చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.
ఖాకీ వనంలో కీచకులు..
త్యాగాలకు మారుపేరైన ఖాకీవనంలో కొందరు కలుపుమొక్కలుగా మారి చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నాయి. కొందరు పోలీసులే దందాలు, మాఫియాలను నడపడంతోపాటు హత్యలు చేయించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో పోలీస్ శాఖ పరువుపోయింది. విశాఖ డీఎస్పీ రవిబాబు గతంలో చేయించిన ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో హత్య చేయించి దొరికిపోవడం పోలీస్ శాఖను జనంలో పలుచన చేసింది. భార్యాభర్తల వివాదం పరిష్కారంలో కృష్ణా జిల్లా కూచిపూడి ఎస్‌ఐగా పనిచేసిన గుడివాడ అనిల్ అతి వల్ల మొవ్వ మండలం కోసూరు శివారు తురకపాలెం గ్రామానికి చెందిన వీరంకి శ్రీహరి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన వివాహిత ఫోన్ నెంబర్‌ను తీసుకున్న నూజివీడుకు చెందిన ఎస్‌ఐ వెంకటకుమార్ తన కోరిక తీర్చకుంటే వివాహిత భర్తను కేసులో ఇరికిస్తానంటూ నీచంగా ప్రవర్తించిన వైనం ప్రతి ఒక్కరినీ విస్మయపరిచింది.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్‌ఐ విజయకుమార్ నూజివీడుకు చెందిన ఒక బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం నెరపడంతో ఆ ఫొటోలు, వీడియోను ఆమె భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఆ ఎస్‌ఐ సస్పెండ్ అయ్యాడు. మచిలీపట్నం సహోద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేసిన పోస్టల్ ఉద్యోగిని నుంచి రూ.25 వేలు లంచం తీసుకున్న ఎస్‌ఐ అశ్వక్‌పై క్రమశిక్షణ వేటు పడింది. తిరుపతిలో కుటుంబ వివాదాలపై ఫిర్యాదు చేసిన వివాహితతో ఫోన్‌లో తరచూ మాట్లాడుతూ తన రూమ్‌కు రావాలని కోరిన సీఐపై ఆమె అధికారులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఏపీఎస్‌పీ బెటాలియన్ (మంగళగిరి) అసిస్టెంట్ కమాండెంట్ పీఎన్‌డీ ప్రసాద్ సస్పెండ్ అయ్యాడు. విజయవాడ బస్టాండులో అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment