అధికారమే పరమావధిగా లెక్కలేనన్ని కుట్రలు చేస్తున్నారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనలేక కుయుక్తులకు తెగబడుతున్నారు. ఆ పార్టీ అధినేతపై హత్యాయత్నం నుంచి తాజాగా జిల్లాలోని వివిధ నేతలకు వస్తున్న బెదిరింపులు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఓ వైపు తమకు వ్యతిరేకులైనవారి ఓట్లను తొలగించేందుకు దొంగసర్వేలు చేపట్టడం... వాటిని అడ్డుకున్నవారిని అడ్డగోలుగా అరెస్టు చేయడం... చివరకు జిల్లా నాయకుల్లో భయోత్పాతాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నం... ఇవన్నీ పాలకపక్షం అనుసరిస్తున్న దుస్సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజా క్షేత్రంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తున్న వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికి అధికార తెలుగుదేశం పార్టీ అడుగడుగునా కుట్రలకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లాలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు వచ్చిన అపూర్వ ప్రజాదరణను చూసినప్పటి నుంచీ ఈ దుశ్చర్యలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టాలని... అవసరమైతే ముఖ్యులనుహతమార్చాలని పన్నాగాలు రచించింది. గతేడాది సెప్టెంబర్ 24న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం, చింతలపాలెంలో అడుగుపెట్టింది. పాదయాత్ర జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుని జగన్ చరిత్ర సృష్టించారు.
అక్కడ జరిగిన బహిరంగకు వచ్చిన జనం చూసి అధికార పార్టీ కన్నుకుట్టింది. అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ అదే ప్రభంజనం కొనసాగింది. ఆ జన ఉప్పెనను చూసిన అధికారపక్షం జగన్‌ను ఎలాగైనా ఆపాలని అప్పటికే చేసిన నిర్ణయాన్ని ఇక ఆలస్యం చేయకుండా అమలుచేసేలా పథకం రచించింది. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పాయకపాడు నుంచి గతేడాది అక్టోబర్ 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లిన జగన్‌పై వీఐపీ లాంజ్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానీ గంటలోనే రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఈ విషయంపై చాలా తేలిగ్గా మాట్లాడారు. కోడికత్తికే ఇంత రాద్ధాంతమేంటని చులకనచేశారు.
ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యం
జిల్లాలో టీడీపీ మరోకుట్రకు తెరదీసింది. ప్రైవేటు సంస్థలను నియమించుకుని గ్రామాల్లో సర్వే మొదలుపెట్టింది. ప్రతిపక్షానికి అనుకూలంగా ఎవరైనా తమ ప్రశ్నలకు బదులిస్తే వారిని భయపెట్టడం ఈ సర్వే బృందాల ప్రధాన విధి. టీడీపీకి ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయించింది. అయినా లొంగని వారిని గుర్తించి వారి ఓట్లు జాబితాల్లో లేకుండా చేయాలని కుట్ర పన్నింది. జిల్లా వ్యాప్తంగా 700 మంది సర్వే బృందాలను రంగంలోకి దించి ఈ ప్రక్రియను పోలీసుల అండతో జరిపిస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర డీజీపీకి వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
సర్వేల పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్న వారిని అడ్డుకున్నందుకు జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్, (చిత్రంలో) తాజాగా బెదిరింపులను ఎదుర్కొన్న ఇందుకూరి రఘురాజు.
పార్టీ నేతల అక్రమ అరెస్టులు
ఓటర్ల జాబితాల్లో పేర్ల గల్లంతే లక్ష్యంగా సాగుతున్న సర్వేపై అనుమానం వచ్చి వైఎస్సార్‌సీపీ నేతలు సర్వే బృందాలను అడ్డుకున్నారు. అదే వారు చేసిన నేరంగా పరిగణించి జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు ఆయనపై లేకపోయినా అరెస్ట్ చేయించింది. అతనితో పాటు మరికొంత మంది పార్టీ నాయకులను గత నెల 25న అక్రమంగా అరెస్ట్ చేసి భయానక వాతావరణాన్ని జిల్లాలో సృష్టించింది. అరెస్ట్ చేసిన తర్వాత మజ్జి శ్రీనివాసరావును శృంగవరపుకోట నియోజకవర్గం జామి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుల ద్వారా ప్రతిపక్షం స్ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వం చూసింది. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా మారడం విమర్శలకు దారితీసింది.
చంపేస్తామంటున్నా అదే నిర్లక్ష్యం
ఇప్పుడు శృంగవరపుకోట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజుపై హత్యకు కుట్ర జరుగుతున్నా... దానిని కూడా తేలిగ్గా తీసుకుని, నిందితులను రక్షిస్తున్నారు. నెల రోజులుగా రఘురాజుకు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తుంటే ఆయన ఎస్‌కోట పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫోన్ నంబర్ల ఆధారంగా నాలుగు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి గురించి ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి ఆకతాయిల పనిగా తేల్చేసి, కేసును నీరుగార్చేశారు. హత్య చేయడానికి తమకు రూ.3 కోట్లు ఇస్తామన్నారని ఫోన్లో బెదిరించిన వారిని అంత తేలికగా ఎలా వదిలేశారని అడిగితే పోలీసుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. రేపేదైనా జరగరానిది జరిగితే దానికి ఈ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహిస్తారా అని ప్రతిపక్షం అడుగుతున్నా వారిలో చలనం లేదు.
Comments
Please login to add a commentAdd a comment