సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో నిజంగా టీడీపీ నేతల చేతులకు రక్తం అంటక పోతే ఎన్‌ఐఏ విచారణకు ఆటంకాలెందుకు సృష్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ సూటిగా ప్రశ్నించారు. ఎన్‌ఐఏ విచారణతో డొంకంతా కదులుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే... ‘తమ్ముళ్లూ... అది కోడికత్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎగతాళి చేసి మాట్లాడారని, అది కోడి కత్తో... నారా కత్తో త్వరలో తేలుతుందని ఇక్బాల్ హెచ్చరిక చేశారు. ఎన్‌ఐఏ విచారణకు సహకరించకుండా అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, డీజీపీ ఇద్దరూ కేసును తప్పు దోవ పట్టించేయత్నం చేశారని ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ప్రకటనతో గరుడ ఫ్లెక్సీ, మడతలు లేని లేఖను సృష్టించారు కాబట్టే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలవని హైకోర్టును ఆశ్రయించామని, ఇది కేంద్రం పరిధిలో ఉందని పౌర, విమానయాన చట్టం ప్రకారం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఎన్‌ఐఏకి అప్పగించాలని తెలిసినా చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు.
చివరికి హైకోర్టు ఆదేశాలతో ఎన్‌ఐఏకి కేసును అప్పగించక తప్పలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉందని, నిందితుడు శ్రీనివాసరావును ఎవరెవరు ప్రోత్సహించారో తేలాల్సి ఉందని ఎన్‌ఐఏ స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు తాను స్వయంగా అబద్ధాలు చెప్పడమే కాక, డీజీపీతోనూ చెప్పించారని, అప్పట్లో వికటాట్టహాసం చేసిన చంద్రబాబు ఇపుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఇక్బాల్ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి నేర చరిత్ర కలిగిన శ్రీనివాసరావును ఎలా పనిలో పెట్టుకున్నాడనే దానిపై కూడా ఎన్‌ఐఏ విచారణ చేపడుతుందని ఇక్బాల్ తెలిపారు. ఇన్ని అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టి, నయవంచన చేసినట్లు మాట్లాడుతున్నాడంటే ఎక్కడ ఆ కత్తి నారా కత్తిగా మారి తన మెడ మీద వేలాడుతుందోనని భయపడుతున్నాడన్నారు. ఈ కేసులో డొంక కదులుతోందని తెలిసే చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకుని లోకేష్‌ను పంపించారని అన్నారు. దర్యాప్తు కొనసాగాలని ఎన్‌ఐఏ చెబుతుంటే... దర్యాప్తు ముగిసిందని చెప్పడం ఏమిటని మండిపడ్డారు.
సీఎంగా వైఎస్ ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకో చంద్రబాబూ!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలా వ్యవహరించారో చంద్రబాబు గుర్తు చేసుకోవాలని ఇక్బాల్ సూచించారు. పరిటాల రవి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేస్తే వైఎస్ వెంటనే ఆదేశించారన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగినపుడు కనీస బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ప్రజలకు తన మొహం చూపించే అర్హతే లేదని, ఆయన నల్లగుడ్డ కప్పుకుని ప్రజల ముందుకు రావాలని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలను ఇప్పటికే చంద్రబాబు మోసం చేశారని, పసుపు–కుంకుమ పేరుతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినందుకు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.
కోడి కత్తో... నారా వారి కత్తో తేలుతుంది
Published Sun, Feb 3 2019 4:36 AM | Last Updated on Sun, Feb 3 2019 4:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment