సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వక్రమార్గంలో గెలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని వక్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే ఈ హత్యాయత్నం కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో ఎవరున్నారో తేలాలన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని, ఇప్పటికైన ప్రభుత్వానికి కనివిప్పు కావాలన్నారు. వాస్తవాలు బయటకి వస్తే అసలు కుట్ర దారులు ఎవరో తెలస్తుందన్నారు.
ప్రతిపక్షనేతపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే ప్రజలు భావించారన్నారు. దాడి జరిగిన గంటలోపే డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎలాంటి విచారణ చేయకుండా కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడిని ఎవరు చేశారో పోలీసులు విచారణ చేసి చెప్పాలని కానీ డీజీపీకి కనీస అవగాహన లేదని ఎద్దేవ చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి, డీజీపీలు వైఎస్ జగన్‌ను కనీసం పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే అప్పటి ప్రతిపక్షనేత, దివంగత నేత వైఎస్సార్.. గాంధీ విగ్రహం దగ్గర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. అది మానవత్వమంటే అని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం తీరు చూస్తుంటే.. బాధ్యులను రక్షించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీనివాసరావుపై 307 సెక్షన్ వేసి వదిలేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment