సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణ ప్రారంభించడం.. టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించడం సరైనది కాదనీ, దీనిపై ప్రభుత్వానికి పలు అభ్యంతరాలు ఉన్నాయని ఐదు పేజీల లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్‌ఐఏకు ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. దాడి ఘటన విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రీకాల్ చేయాలని లేఖలో ప్రధాని మోదీని కోరారు. చంద్రబాబు లేఖపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తీరుతో దాడి ఘటనలో నిజంగానే టీడీపీ పాత్ర ఉన్నదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ హస్తం ఉందని మొదటినుంచి ప్రతిపక్ష వైస్సార్‌సీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌ఐఏ విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే చంద్రబాబు విచారణకు సహరించడంలేదని వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌పై దాడిలో టీడీపీ పాత్ర లేకపోతే ఎన్‌ఐఏ విచారణకు ఆ పార్టీ సహకరించాలి, కానీ అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం పరిశీలకుల్ని విస్మయ పరుస్తోంది. ఎన్‌ఐఏ దర్యాప్తు మొదలైన నాటినుంచి టీడీపీ సర్కారు, ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ దర్యాప్తు అనగానే చంద్రబాబు సర్కారు ఎందుకు వణికిపోతోందని, ఈ కేసులో టీడీపీ పాత్ర ఏమాత్రం లేనిపక్షంలో ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్‌ఐఏ దర్యాప్తుకు సహకరించడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తప్పేమీ లేనప్పడు ఎన్‌ఐఏ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment