సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. ప్రతిపక్ష నేతను భౌతికంగా అంతం చేసేందుకు సాగించిన కుట్ర బయట పడుతుందనే భయం చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్న విషయం తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. ఎన్‌ఐఏకు ఏపీ పోలీసుల సహాయ నిరాకరణతోపాటు దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కారు 2 రోజులుగా మల్లగుల్లాలు పడుతున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. గతేడాది అక్టోబర్ 25న జగన్‌పై కత్తితో హత్యాయత్నం చేయడాన్ని ఖండించకుండా సీఎం చేసిన వ్యాఖ్యలు, డీజీపీ ఠాకూర్ చేసిన ప్రకటన ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో అప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే కుట్రకోణాన్ని మరుగున పరిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వశక్తులూ ఒడ్డిందని తేటతెల్లమవుతోంది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అసలు కుట్రను ఛేదించేలా ఏపీ పోలీసులు ఒక్క ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సైతం నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును తిప్పి, కేవలం అతడిపైనే కేసును పరిమితం చేసి, అసలు కుట్రదారులను తప్పించేందుకు ముందస్తు స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుందనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగానే ప్రభుత్వ యంత్రాంగంలో పై నుంచి కింది వరకూ ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేశారన్నది బహిరంగ రహస్యమే.
ఎన్‌ఐఏపై ఎందుకీ ద్విముఖ వైఖరి?
ఎన్‌ఐఏపై చంద్రబాబు సర్కారు అవలంభిస్తున్న ద్విముఖ వైఖరిని సాక్షాత్తూ సీనియర్ పోలీసు అధికారులే తప్పుబడుతున్నారు. కీలక కేసుల్లో ఎన్‌ఐఏ జోక్యం చేసుకోవడం సర్వసాధారణం. కానీ, ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు ఇలా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా కేంద్రంగా జరిగిన 2 ప్రధాన ఘటనల్లో ఎన్‌ఐఏ చేపట్టిన దర్యాప్తుపై చంద్రబాబు పరస్పరం భిన్నంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. విశాఖ జిల్లా అరకు అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెల్సిందే. ఈ కేసును విశాఖ జిల్లా డుంబ్రిగూడ పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేసిన ఈ కేసు దర్యాప్తును డిసెంబర్‌లో ఎన్‌ఐఏ తన చేతుల్లోకి తీసుకుంది.
వాస్తవానికి మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి, స్థానికుల ఎదుటే కిడారి, సోమలను కాల్చి చంపారు. వారిని తామే హత్య చేసినట్లు మావోయిస్టులూ ప్రకటించారు. అయినా ఆ కేసును ఎన్‌ఐఏ తీసుకుంది. అలాంటప్పుడు ప్రతిపక్ష నేతను మట్టుబెట్టాలనే లక్ష్యంతో జరిగిన కుట్ర కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపడితే చంద్రబాబు సర్కారు ఎందుకు కలవరపడుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిని పట్టుకోవడం తప్ప ఇంకేమీ జరగలేదు. సీఎం, డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని, కుట్ర కోణం వదిలి నిందితుడికే కేసును పరిమితం చేయడం సరికాదని, థర్డ్‌పార్టీతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కిడారి హత్య కేసును ఎన్‌ఐఏ చేపడితే తప్పుబట్టని చంద్రబాబు ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపడితే గగ్గోలు పెడుతుండడం గమనార్హం.
కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం
ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ చేపట్టిందని తెలియగానే అధికార పక్షంలో కలవరపాటు మొదలైంది. ఎన్‌ఐఏ దర్యాప్తునకు అడ్డుపడేలా ఎలా వ్యవహరించాలనే దానిపై చంద్రబాబు 2 రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు. డీజీపీతోపాటు పోలీసు ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్, ఆంతరంగికులతో సీఎం ఆదివారం నిర్వహించిన సమావేశంలోనూ ఎన్‌ఐఏ దర్యాప్తును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతోపాటు ఎన్‌ఐఏ అధికారులు ఏం అడిగిన ఏపీ పోలీసులు నోరు మెదపవద్దని, సహాయ నిరాకరణ చేయాలని లోపాయికారీగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఆధారాలు దొరక్కుండా పన్నాగాలు
జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజున చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ విమానాశ్రయం భద్రత కేంద్రం పరిధిలోనిదని, ప్రతిపక్ష నేతపై హత్యాయత్నంతో తమకు సంబంధం లేదన్నారు. మరి కేంద్రం పరిధిలోని విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తే రాష్ట్రప్రభుత్వం ఎందుకు బెంబేలెత్తిపోతోందో అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏకు సహకరించవద్దంటూ మౌఖిక ఆదేశాలు అందినట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న ఎన్‌ఐఏ కేసు నమోదు చేస్తే హడావుడిగా 2న విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ లడ్హా మీడియా సమావేశం నిర్వహించి పాతపాటే పాడటం వెనుక పెద్దల డైరెక్షన్ ఉందంటున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తునకు సహకరించకపోవడంతోపాటు ఆధారాలు దొరక్కుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment