రాష్ట్రంపై కేంద్రం పెత్తనమా? | Chandrababu Comments on Central Govt at the press conference | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై కేంద్రం పెత్తనమా?

Published Sun, Jan 13 2019 3:53 AM | Last Updated on Sun, Jan 13 2019 4:40 AM

Chandrababu Comments on Central Govt at the press conference - Sakshi

సాక్షి, అమరావతి: విమానాశ్రయంలో భద్రతా వ్యవహారాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అక్కడ జరిగే ఘటనలపై విచారణ జరిపే బాధ్యత మాత్రం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విమానాశ్రయంలో కేంద్రం విఫలమైనా దానిపై దర్యాప్తు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం అధికారాన్ని కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన ఎయిర్‌పోర్టు తమ పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని చెప్పి ఇప్పుడు కేంద్రం ఆధీనంలోని ఎన్‌ఐఏ విచారణను ఎలా తప్పుపడతారని ప్రశ్నించగా... ఎయిర్‌పోర్టులో భద్రత మాత్రమే కేంద్రం చూసుకోవాలని, అక్కడ శాంతిభద్రతలు విఫలమైతే వాటిపై తాము దర్యాప్తు చేస్తామన్నారు.

రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని కేంద్రం హరిస్తోందని ఆరోపించారు. తమ పరిధిలోని అంశాలపై కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని అన్నారు. రాష్ట్రాల వ్యవహారాల్లో ఎన్‌ఐఏ జోక్యం చేసుకుంటోందని గతంలో మోదీ విమర్శించారని, ఇప్పుడు ఆయనే ఏపీలోకి ఎన్‌ఐఏను పంపుతున్నారని మండిపడ్డారు. అందుకే సీబీఐకి సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నామని, అవినీతి ఆరోపణలు ప్రధానమంత్రిపైనా ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎన్‌ఐఏ ఎవరని నిలదీశారు. దీనిపై కోర్టుకెళతామని, జాతీయ స్థాయిలో చర్చకు పెడతామని వెల్లడించారు. 

కాంగ్రెస్‌ హయాంలో 50 మందిని చంపారు 
రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించలేదని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పరిటాల రవి సహా 50 మందిని హత్య చేశారని ఆరోపించారు. రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తమను విమర్శిస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్‌ కూడా అంతలేదని చెప్పారు. తమ అవినీతిపై విచారణ జరిపి, జైల్లో పెడతామంటున్నారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారో జగన్, కేసీఆర్, మోదీ కలిసి చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీ చూసి భయపడి పెన్షన్‌ పెంచామంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ చెప్పేవి నవ రత్నాలు కాదని, నవగ్రహాలని ఆరోపించారు. 

మాది చిన్నపార్టీ 
ఈబీసీ రిజర్వేషన్లు చేసే ముందు కేంద్రం ఎవరినీ సంప్రదించలేదని, ఏ రాష్ట్రంతోనూ మాట్లాడలేదని, ప్రజలను సిద్ధం చేయకుండా ఉన్నట్టుండి ఇలాంటివి ఎలా చేస్తారని చంద్రబాబు నిలదీశారు. కాపు రిజర్వేషన్ల గురించి తమ ప్రతిపాదనలను ఒప్పకోలేదని, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల గురిచి ఒప్పుకోలేదని కానీ ఈబీసీలకు ఇచ్చారని విమర్శించారు. తనకు ప్రధానమంత్రి పదవి వద్దని చెబుతున్నానని, గతంలో తీసుకోమన్నా తీసుకోలేదని, తమది చిన్న పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పింఛన్‌తో వృద్ధులకు గౌరవం 
రెండు చేతులూ లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తామని సీఎం చెప్పారు. ఇళ్లు, ఫించన్లు, రేషన్‌ వందశాతం ఇవ్వగలిగామన్నారు. రూ.1,000 పింఛన్‌తో వృద్ధులను గౌరవిస్తున్నారని, ఇప్పుడు రూ.2000 పింఛన్‌తో వారిని చూసుకోవడానికి పోటీ పడతారని అన్నారు. ఏపీలో లోటు బడ్జెట్‌ ఉన్నా కేసీఆర్‌ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తేల్చిచెప్పారు. «ఒకేరోజు రెండు పెద్ద సంస్థలు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని తెలిపారు. జిల్లా ప్రణాళికలను 21 నుంచి విడుదల చేస్తామని, త్వరలో రాష్ట్రస్థాయి ప్రణాళికను వెల్లడిస్తామన్నారు. 

ఎన్‌ఐఏ విచారణను ఉపసంహరించండి 
ప్రధానమంత్రి మోదీకి సీఎం చంద్రబాబు లేఖ 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధానమంత్రికి ఐదు పేజీల లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ కేసును ఎన్‌ఐఏ విచారణకు అప్పగించారని తప్పుపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement