కొత్తగా నిర్మించిన కాయగూరల మార్కెట్ సముదాయం
సాక్షి, హిందూపురం: హిందూపురం వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఆధునిక భవనాలు, వసతులతో కూడిన వాణిజ్య, కాయగూరల మార్కెట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల రెండో వారంలో కొత్త మార్కెట్ ప్రారంభానికి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి.
వ్యాపారులను చిదిమేసిన టీడీపీ పాలకులు..
దశాబ్దాలుగా ఎందరో వ్యాపారులకు జీవనపాధి కల్పించిన మార్కెట్ సముదాయాన్ని గత టీడీపీ పాలకులు ముందు చూపు లేకుండా కూల్చేసి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. మల్టీఫ్లస్ త్రీ ఫ్లోర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో 2016లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి వ్యాపారులను ఖాళీ చేయించి తెల్లారిసరికే పూర్తిగా నేలమట్టం చేసేశారు. 2.24 ఎకరాల్లో రూ.100 కోట్లతో కాంప్లెక్స్‌ను రెండు బ్లాక్‌లుగా విభజించి రెండు సెల్లార్లు, హోల్‌సేల్ మండీలు, రెండో ఫ్లోర్‌లో కోల్డ్ స్టోరేజీలు, కాయగూరల మార్కెట్, ఆడిటోరియం, ఏసీ గోదాములు, మూడో ఫ్లోర్‌లో రెండు మల్టీఫ్లక్స్ థియేటర్లు నిర్మిస్తామంటూ గొప్పలకు పోయారు. చివరకు రూ.23 కోట్లతో రెండు ఫ్లోర్లలో గదుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని పునాదులకే పరిమితం చేశారు.
చదవండి: (ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని)
కల సాకారం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మార్కెట్ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తీసుకెళ్లారు. రోడ్డున పడ్డ వ్యాపారులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం, మున్సిపాలిటీ, గుడ్‌విల్ మొత్తం రూ.23కోట్ల నిధులతోపాటు మరో రూ.25కోట్లకు పైగా ఖర్చు చేసి ఆధునిక వసతులతో మార్కెట్ సముదాయాల నిర్మాణాలను పూర్తి చేయించారు. దీంతో పట్టణ ప్రజలు, చిరు వ్యాపారుల కల సాకారమైంది.
మార్కెట్‌లోని చాంబర్లు
321 గదులతో సుందరంగా..
నూతనంగా నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని మూడు బ్లాక్‌లుగా విభజించారు. మొత్తం 321 గదుల నిర్మాణం పూర్తి అయింది. ‘ఏ’ బ్లాక్‌లో మొత్తం వాణిజ్య విభాగానికి సంబంధించిన గదులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 75 షాపులు ఉండగా ఫస్ట్ ఫ్లోర్‌లో మరో 79 షాపులున్నాయి. ‘బీ, సీ’ బ్లాక్‌లకు సంబంధించి గ్రౌండ్‌ఫ్లోర్‌లో 99 గదులు ఉండగా, ఫస్ట్‌ఫ్లోర్‌లో మరో 68 గదులు ఉన్నాయి. వందలాది వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసేలా ప్రత్యేకంగా విశాలమైన సెల్లార్‌ను ఏర్పాటు చేశారు. కూరగాయల బస్తాల దిగుమతి కోసం భారీ వాహనాలు సైతం సెల్లార్‌లోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు చుట్టూ ఐదు గేట్లు ఏర్పాటు చేసి, సీసీ రోడ్లు వేశారు. గాం«దీసర్కిల్ వైపున ఉన్న ప్రధాన గేట్ దాటిన తర్వాత అందమైన పార్క్‌తో పాటు వివిధ ఆకృతులను ఏర్పాటు చేస్తున్నారు.
10న ప్రారంభం
ఈ నెల 10వ తేదీన మార్కెట్ సముదాయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూపురం వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కెట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. మార్కెట్ వల్ల నెలకు సుమారు రూ.19 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరనుంది. ఈ నిధులు పట్టణాభివృద్ధికి దోహదపడతాయి.
– వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం
చాలా ఆనందంగా ఉంది
టీడీపీ పాలనలో వీధిన పడ్డ కాయగూరల వ్యాపారులను ఆదుకునేలా మార్కెట్ నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు, వ్యాపారుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని హంగులతో మార్కెట్‌ను సిద్ధం చేశాం.
– మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ సహకారం మరువలేం
ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు గత మున్సిపాలిటీని ఏలిన టీడీపీ పాలకులు మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పాత మార్కెట్‌ను కూల్చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. అప్పటి నుంచి సరైన వ్యాపారాలు లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. రైతుబజార్, ఎంసీఎం మైదానంలో ఎండకు, వానాలకు నానా ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చొరవతో మార్కెట్ నిర్మాణం వేగవంతమైంది. ఇన్నాళ్లకు మా కల నేరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
– చాంద్‌బాషా, కాయగూరల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment