ముంబై: అమెరికాలో అవమానానికి గురైన తన కుమార్తె, భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేకు తగిన న్యాయం జరగకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యూయార్‌కలో భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని ఖోబ్రగడే పనిమనిషి విషయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా అధికారులు ఆమెను అరెస్టు చేసి అవమానకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్య ప్రవర్తనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
ఆ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ విషయమై దేవయాని తండ్రి ఉత్తమ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ నా కుమార్తెకు జరిగిన అన్యాయంపై భారత ప్రభుత్వం స్పందిస్తున్న తీరును గమనిస్తున్నా. మరో వారం రోజుల్లో న్యూఢిల్లీ వెళతా. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలుస్తా. నా కుమార్తెకు తగిన న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతా..’ అని చెప్పారు. కాగా, తన కుమార్తెను కుట్రపూరితంగానే అమెరికా అధికారులు నిర్బంధించారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసులను ఆ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా వ్యాఖ్యలు భారత దేశ న్యాయవ్యవస్థనే కించపరిచేవిగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఉత్తమ్ తెలిపారు. కాగా, దేవయాని సంఘటనకు నిరసనగా ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు యూఎస్ జాతీయ పతాకాన్ని దగ్ధం చేశారు.