Uttam Khobragade
-
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తా: దేవయాని తండ్రి
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని దేవయాని ఖోబ్రగడే తండ్రి, సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే స్పష్టం చేశారు. దేవయాని తండ్రి ఉత్తమ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో వస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇందులో కొత్త విషయమేమీ లేదన్నారు. త్వరలో తన రాజకీయ ఆరంగేట్రం జరుగుతుందన్నారు. తప్పకుండా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటానన్నారు. కాగా ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్న అంశంపై మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. తగిన సమయం చూసుకుని ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అమెరికాలో భారత దౌత్త్యవేత్త గా సేవలందించి పని మనిషి వీసా కేసుకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఆమె గత వారం భారత్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన కూతురు అమెరికాలో ఉన్న పిల్లల్ని భారత్ కు తీసుకు వచ్చే యత్నాల్లో నిమగ్నమైందన్నారు. వారు ఫిబ్రవరి నెలలో భారత్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లల విద్యకు ఆటంకం కల్గకుండా ఉండేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. -
రాజీ లేదు పోరాటమే.. అమెరికాకో దండం
అమెరికాలో అవమానకర పరిస్థితుల్నిఎదుర్కొన్న భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు రాజీచేసుకుని అమెరికాలో ఉండే అవకాశం వచ్చినా నిరాకరించారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించిన అధికారులపై న్యాయపరమైన పోరాటం చేయాలని నిర్ణయించుకుని భారత్‌కు తిరిగివస్తున్నారు. దేవయాని తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ఈ విషయాల్నివెల్లడించారు. ఈ వివాదంపై భారతీయ కోర్టులోనే న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు. 1999 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి దేవయాని వీసా నిబంధనల్ని అతిక్రమించినట్టు అభియోగాల్ని మోపారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడంతో పాటు పూర్తిగా దుస్తులు విప్పి తనిఖీ చేశారని వెలుగులోకి రావడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ''దేవయానీ ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయల్దేరారు" అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్‌లో అరెస్టయినప్పుడు భారత్ తరఫున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం నాడు ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తిచేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాదులు తెలిపారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓప్రకటన విడుదల చేసింది. ''న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్‌క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది'' అని ఆ ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమీ తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. -
న్యాయం జరగకుంటే ఆమరణ దీక్ష
ముంబై: అమెరికాలో అవమానానికి గురైన తన కుమార్తె, భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేకు తగిన న్యాయం జరగకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యూయార్కలో భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని ఖోబ్రగడే పనిమనిషి విషయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా అధికారులు ఆమెను అరెస్టు చేసి అవమానకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్య ప్రవర్తనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ విషయమై దేవయాని తండ్రి ఉత్తమ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ నా కుమార్తెకు జరిగిన అన్యాయంపై భారత ప్రభుత్వం స్పందిస్తున్న తీరును గమనిస్తున్నా. మరో వారం రోజుల్లో న్యూఢిల్లీ వెళతా. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్సింగ్ను కలుస్తా. నా కుమార్తెకు తగిన న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతా..’ అని చెప్పారు. కాగా, తన కుమార్తెను కుట్రపూరితంగానే అమెరికా అధికారులు నిర్బంధించారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసులను ఆ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా వ్యాఖ్యలు భారత దేశ న్యాయవ్యవస్థనే కించపరిచేవిగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఉత్తమ్ తెలిపారు. కాగా, దేవయాని సంఘటనకు నిరసనగా ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు యూఎస్ జాతీయ పతాకాన్ని దగ్ధం చేశారు. -
'నా కూతుర్ని బలిపశువును చేశారు'
న్యూఢిల్లీ: తన కూతురు దేవయాని ఖోబ్రాగాదేను అరెస్టు చేసి బలిపశువును చేశారని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే ఆవేదన వ్యక్తం చేశారు. పని మనిషి వీసాలో తప్పుడు సమాచారాన్ని క్రోఢీకరించారనే అంశంపై అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన తండ్రి ఉత్తమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కూతుర్ని వెనక్కు తీసుకురావడానికి సహకరించాలన్నారు. ఇది ఇరు దేశాలకు సంబంధించిన రాజకీయ అంశంలో తన కూతురు బలి పశువు అయ్యిందన్నారు. తన కూతురు అమాయకురాలని, ఆమె అరెస్టు చేయడం వెనుక ఏదో కుట్ర జరిగిందని మీడియా ముందు వాపోయారు. ఆమెను అరెస్టు చేసిన తీరు మాత్రం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. భారత దౌత్తవేత్తగా సేవలందిస్తున్న ఆమెను అరెస్టు చేసినా, తగిన గౌరవం ఇచ్చి ఉండాల్సిందని ఆయన తెలిపారు. ఈ ఘటన సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకుని దేవయానిని తిరిగి భారత్ కు రప్పించాడానికి కృషి చేయాలన్నారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ను కలుస్తానన్నారు. గురువారం తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం సుమారు రూ. 1.55 కోట్లు పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది.