'నా కూతుర్ని బలిపశువును చేశారు'
న్యూఢిల్లీ: తన కూతురు దేవయాని ఖోబ్రాగాదేను అరెస్టు చేసి బలిపశువును చేశారని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే ఆవేదన వ్యక్తం చేశారు. పని మనిషి వీసాలో తప్పుడు సమాచారాన్ని క్రోఢీకరించారనే అంశంపై అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన తండ్రి ఉత్తమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కూతుర్ని వెనక్కు తీసుకురావడానికి సహకరించాలన్నారు. ఇది ఇరు దేశాలకు సంబంధించిన రాజకీయ అంశంలో తన కూతురు బలి పశువు అయ్యిందన్నారు. తన కూతురు అమాయకురాలని, ఆమె అరెస్టు చేయడం వెనుక ఏదో కుట్ర జరిగిందని మీడియా ముందు వాపోయారు.
ఆమెను అరెస్టు చేసిన తీరు మాత్రం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. భారత దౌత్తవేత్తగా సేవలందిస్తున్న ఆమెను అరెస్టు చేసినా, తగిన గౌరవం ఇచ్చి ఉండాల్సిందని ఆయన తెలిపారు. ఈ ఘటన సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకుని దేవయానిని తిరిగి భారత్ కు రప్పించాడానికి కృషి చేయాలన్నారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ను కలుస్తానన్నారు. గురువారం తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం సుమారు రూ. 1.55 కోట్లు పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది.