Devayani Khobragade
-
దేవయానికి ప్రమోషన్
న్యూఢిల్లీ : పనిమనిషి పాస్‌పోర్టు విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఆమెకు సరిగా జీతం చెల్లించకుండా వేధింపులకు గురిచేశారనే కారణంగా 2013లో అరెస్టైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు సెంట్రల్ అడ్మినిస్ట్రేవ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఊరట లభించింది. 1999 బ్యాచ్‌కు చెందిన దేవయానికి పదోన్నతి కల్పించడంతో పాటు 2016 నుంచి దీనిని వర్తింపచేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్యాట్ ఆదేశించింది. దీంతో జాయింట్ సెక్రటరీగా ఆమె పదోన్నతి పొందనున్నారు. ఆమెపై నమోదైన కేసు విచారణలో జాప్యం చేసినందుకు ఆ శాఖను తప్పుపట్టింది. భారత్‌కు చెందిన తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారనే కారణంతో 2013లో న్యూయార్క్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీనివల్ల భారత్- అమెరికాల మధ్యనున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. మీడియాలో కూడా ఈ విషయం గురించి చర్చ జరగడంతో దేవయానిపై విమర్శలు వెల్లువెత్తాయి. తన పిల్లల పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసిందనే కారణంగా విదేశీ వ్యవహారాల శాఖ ఆమె ప్రమోషన్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా తండ్రితో పాటు అమెరికాలో నివసిస్తున్న దేవయాని ఇద్దరు కుమార్తెలకు భారత పౌరసత్వాన్ని తిరస్కరించింది. ఇండియన్ పాస్‌పోర్టు, పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించించారన్న ఆరోపణలతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం గురించి దేవయాని మాట్లాడుతూ... ‘ఈ కేసులో పిటిషనర్ తల్లి(దేవయాని) ఎప్పుడూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయలేదు. తన భర్త, తనపై ఆధారపడిన వారి గురించి కూడా విదేశీ పౌరసత్వం కల్పించాలని కోరలేదు. భారత విదేశీ విధానం-1961 నిబంధనల ప్రకారం ఇది చట్టాన్ని మీరినట్టు కాదు. 16 ఏళ్ల సర్వీసులో నేను చాలా బాగా పనిచేశానని’ పేర్కొన్నారు. ఈ అంశాల గురించి అఫిడవిట్లో కూడా ప్రస్తావించారు. -
దేవయాని కేసులో అమెరికాపై ఒత్తిడి
న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రాగడేపై అమెరికాలో నమోదైన అభియోగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని భారతప్రభుత్వం పేర్కొంది. 2013లో న్యూయార్క్‌లోని నకిలీ వీసా వినియోగం ఆరోపణలపై దేవయానిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత స్తబ్దత ఏర్పడింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని బుధవారం లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. -
దేవయానిపై అరెస్ట్ వారంట్
తాజాగా అమెరికా అభియోగపత్రం అక్కడికి వెళితే అరెస్టు చేసే అవకాశం వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం: భారత్ న్యూయార్క్: అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వీసా మోసం వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేవయానిపై శనివారం అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. పనిమనిషి సంగీతా రిచర్డ్‌కు తక్కువ జీతం చెల్లించడంతో పాటు ఆమెను వేధింపులకు గురిచేసిందనే అభియోగాలపై డిసెంబర్ 12న దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమెను భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. అయితే దేవయానికి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున గతంలో ఆమెపై ఉన్న కేసును బుధవారం అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. పాత చార్జిషీట్‌పై అరెస్ట్ చేయకూడదని చెప్పిన కోర్టు.. మరోసారి అభియోగపత్రాన్ని దాఖలు చేసే విషయాన్ని మాత్రం తోసిపుచ్చలేదు. కేసు కొట్టివేయడంపై అమెరికా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసిన దరిమిలా మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేసినట్లు మన్‌హటన్‌లోని అమెరికా ప్రభుత్వ న్యాయవాది, భారత సంతతికి చెందిన ప్రీత్ బరారా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జికి లేఖ ద్వారా తెలిపారు. తన పనిమనిషి వీసా దరఖాస్తు విషయంలో అన్నీ తెలిసుండే దేవయాని తప్పుడు సమాచారంతో పాటు పలు తప్పుడు ప్రాతినిధ్యాలు ఇచ్చారని తాజా చార్జిషీట్లో పేర్కొన్నారు. చార్జిషీట్‌కు సంగీత ఉద్యోగ ఒప్పంద పత్రాన్ని, భారత్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా జతచేశారు. భారత్‌లో దేవయాని ఇచ్చిన సమాచారానికి, అమెరికా ఎంబసీకి తెలిపిన సమాచారానికి మధ్య చాలా వ్యత్యాసముందని కోర్టుకు తెలిపారు. దీనిని బట్టి బాధితురాలి వీసా ఇంటర్వ్యూ సమయంలో ఖోబ్రగడే అమెరికా ఎంబసీని మోసం చేశారని, న్యాయసూత్రాలను అతిక్రమించారని తాజా చార్జిషీట్లో అభియోగాలు నమోదు చేశారు. భారత్ ఘాటు హెచ్చరిక దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేయడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇదొక అనవసరపు చర్య అని పేర్కొన్న భారత్.. దీని ప్రభావం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై పడుతుందని హెచ్చరించింది. భారత్ దృష్టిలో ఆ కేసులో ఏవిధమైన యోగ్యతలు లేవని, దేవయాని కూడా భారత్ తిరిగి వచ్చేయడంతో అమెరికా కోర్టు పరిధిలో లేరని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు. మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడంపై చాలా అసంతృప్తిగా ఉన్నామన్నారు. -
దేవయానిపై మళ్లీ కేసు
న్యూయార్క్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వీసా మోసం అభియోగాలతో నమోదైన కేసును అమెరికా కోర్టు కొట్టేసిన మరునాడే ఆమె పై మళ్లీ కేసు నమోదు అయింది. పని మనిషి వీసా కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం, వీసా మోసానికి పాల్పడ్డారన్న అభియోగాలను ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం ఆమెపై తిరిగి నమోదు చేశారు. మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టులో ఈ మేరకు దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. కాగా వీసా మోసం కేసులో దేవయానిని అమెరికా పోలీసులు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్టు చేయడం, దుస్తులు విప్పి తనిఖీ చేయడం, క్రిమినల్స్‌తోపాటు ఒకే చెరలో ఉంచడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన విషయం తెలిసిందే. దేవయానిపై కేసును కోర్టు కొట్టివేసినా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మళ్లీ నేరాభియోగాలు మోపడంతో వివాదం తిరిగి మొదటికొచ్చినట్లైంది. -
దేవయానికి ఊరట..
అగ్రరాజ్యానికి షాక్ భారత దౌత్యవేత్తపై అభియోగాలు కొట్టేసిన అమెరికా కోర్టు కొత్త అభియోగాలు నమోదు చేసేందుకు యత్నాలు న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా-భారత్‌ల మధ్య ఆగ్రహ జ్వాలలకు ఆజ్యం పోసిన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కేసులో మనకు ఓ ఆశావహ పరిణామం. దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు బుధవారం కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ ఈ మేరకు 14 పేజీల తీర్పు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో భారత వ్యవహారాల అధికారిగా ఆమె నియామకాన్ని అమెరికా జనవరి 8న ఆమోదించిందని, అప్పటి నుంచి ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ లభించిందని జడ్జి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 9న ఆమెపై నమోదు చేసిన అభియోగాలు చెల్లవని స్పష్టంచేశారు. ఆమెపై ఎలాంటి అరెస్టు వారెంట్లు ఉన్నా అవి ఇక రద్దవుతాయని తెలిపారు. అభియోగాల్లో పేర్కొన్న ఆరోపణలు.. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా చేసినవి కాకుంటే.. ప్రాసిక్యూషన్ కొత్త అభియోగాలు నమోదు చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని పేర్కొన్నారు. దేవయాని తరఫు న్యాయవాది డీనియల్ అర్షక్ కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేసు కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు. ఈ విషయంలో అమెరికా తగిన విధంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు. దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే స్పందిస్తూ.. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి, అధికారులకు తాము రుణపడి ఉంటామన్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో దేవయాని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మళ్లీ అభియోగాలు నమోదు: దేవయానిపై కొత్త అభియోగాలు నమోదు చేయకూడదని కోర్టు చెప్పలేదని, కాబట్టి దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అమెరికా తెలిపింది. అమెరికాలో ఈ కేసు వ్యవహారాలు చూస్తున్న మన్హటన్ అటార్నీ ప్రీత్ భరారా ప్రతినిధి జేమ్స్ మీడియాతో మాట్లాడుతూ.. దౌత్యరక్షణ వర్తించదన్న తమ వాదనను కోర్టు కొట్టేసిందన్నారు. అయితే వీసా కేసులో ఆమె చెప్పిన అబ ద్ధాలు దౌత్య కార్యక్రమాల పరిధిలోకి రావు కాబట్టి.. ఆ దిశగా కేసు పెట్టే ఆలోచన చేస్తామన్నారు. -
భారత్‌కు తిరిగొస్తున్న దేవయాని
భారతీయ దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగడేపై ఎట్టకేలకు అమెరికా గ్రాండ్ జ్యూరీ నేరాన్ని నిర్ధరించింది. అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా కోరడంతో ఆమె తిరిగి భారత్ వస్తున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. ''దేవయానీ ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయల్దేరారు" అని అందులో చెప్పారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి, పూర్తిగా దుస్తులు విప్పి వెతకడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్‌లో అరెస్టయినప్పుడు భారత్ తరఫున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం నాడు ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తిచేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాదులు తెలిపారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓప్రకటన విడుదల చేసింది. ''న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్‌క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది'' అని ఆ ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమీ తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. -
న్యాయం జరగకుంటే ఆమరణ దీక్ష
ముంబై: అమెరికాలో అవమానానికి గురైన తన కుమార్తె, భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేకు తగిన న్యాయం జరగకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యూయార్కలో భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని ఖోబ్రగడే పనిమనిషి విషయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా అధికారులు ఆమెను అరెస్టు చేసి అవమానకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్య ప్రవర్తనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ విషయమై దేవయాని తండ్రి ఉత్తమ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ నా కుమార్తెకు జరిగిన అన్యాయంపై భారత ప్రభుత్వం స్పందిస్తున్న తీరును గమనిస్తున్నా. మరో వారం రోజుల్లో న్యూఢిల్లీ వెళతా. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్సింగ్ను కలుస్తా. నా కుమార్తెకు తగిన న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతా..’ అని చెప్పారు. కాగా, తన కుమార్తెను కుట్రపూరితంగానే అమెరికా అధికారులు నిర్బంధించారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసులను ఆ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా వ్యాఖ్యలు భారత దేశ న్యాయవ్యవస్థనే కించపరిచేవిగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఉత్తమ్ తెలిపారు. కాగా, దేవయాని సంఘటనకు నిరసనగా ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు యూఎస్ జాతీయ పతాకాన్ని దగ్ధం చేశారు.