దేవయానిపై అరెస్ట్ వారంట్
తాజాగా అమెరికా అభియోగపత్రం
అక్కడికి వెళితే అరెస్టు చేసే అవకాశం
వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం: భారత్
న్యూయార్క్: అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వీసా మోసం వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేవయానిపై శనివారం అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. పనిమనిషి సంగీతా రిచర్డ్‌కు తక్కువ జీతం చెల్లించడంతో పాటు ఆమెను వేధింపులకు గురిచేసిందనే అభియోగాలపై డిసెంబర్ 12న దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమెను భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. అయితే దేవయానికి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున గతంలో ఆమెపై ఉన్న కేసును బుధవారం అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. పాత చార్జిషీట్‌పై అరెస్ట్ చేయకూడదని చెప్పిన కోర్టు.. మరోసారి అభియోగపత్రాన్ని దాఖలు చేసే విషయాన్ని మాత్రం తోసిపుచ్చలేదు.
కేసు కొట్టివేయడంపై అమెరికా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసిన దరిమిలా మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేసినట్లు మన్‌హటన్‌లోని అమెరికా ప్రభుత్వ న్యాయవాది, భారత సంతతికి చెందిన ప్రీత్ బరారా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జికి లేఖ ద్వారా తెలిపారు. తన పనిమనిషి వీసా దరఖాస్తు విషయంలో అన్నీ తెలిసుండే దేవయాని తప్పుడు సమాచారంతో పాటు పలు తప్పుడు ప్రాతినిధ్యాలు ఇచ్చారని తాజా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. చార్జిషీట్‌కు సంగీత ఉద్యోగ ఒప్పంద పత్రాన్ని, భారత్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా జతచేశారు. భారత్‌లో దేవయాని ఇచ్చిన సమాచారానికి, అమెరికా ఎంబసీకి తెలిపిన సమాచారానికి మధ్య చాలా వ్యత్యాసముందని కోర్టుకు తెలిపారు. దీనిని బట్టి బాధితురాలి వీసా ఇంటర్వ్యూ సమయంలో ఖోబ్రగడే అమెరికా ఎంబసీని మోసం చేశారని, న్యాయసూత్రాలను అతిక్రమించారని తాజా చార్జిషీట్‌లో అభియోగాలు నమోదు చేశారు.
భారత్ ఘాటు హెచ్చరిక
దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేయడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇదొక అనవసరపు చర్య అని పేర్కొన్న భారత్.. దీని ప్రభావం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై పడుతుందని హెచ్చరించింది. భారత్ దృష్టిలో ఆ కేసులో ఏవిధమైన యోగ్యతలు లేవని, దేవయాని కూడా భారత్ తిరిగి వచ్చేయడంతో అమెరికా కోర్టు పరిధిలో లేరని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు. మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడంపై చాలా అసంతృప్తిగా ఉన్నామన్నారు.