Preet Bharara
-
‘ట్రంప్ ఫోన్ చేశారు.. ఆయనే మాట్లాడలేదు’
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అటార్నీగా పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్ ప్రీత్ బరారాకు ఫోన్ చేసి మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని శ్వేతసౌదం తెలిపింది. అయితే, ఆయనే ఫోన్ ఎత్తలేదని పేర్కొంది. గత గురువారమే ట్రంప్ ఆయనకు ఫోన్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారని వెల్లడించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన హయాంతో బరారాతోపాటు దాదాపు 46మందిని అటార్నీలుగా నియమించారు. ప్రస్తుతం ట్రంప్ పాలన రావడంతో ఆ స్థానాలు భర్తీ చేసేందుకు ఒబామా హయాంలో నియమించబడిన అధికారులంతా కూడా ఉన్నపలంగా తమ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశించారు. అయితే, గతంలోనే ట్రంప్‌ను కలిసిన బరారా ఆయన కొనసాగేందుకు అనుమతి తీసుకున్నట్లు చెబుతూ తాను బాధ్యతల నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. దీంతో తనపై ట్రంప్ అధికార వర్గం తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బరారా మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైట్ హౌస్ తాము ముందే బరారాకు ఈ విషయం చెప్పామని, ఆయనే అందించిన విలువైన సేవలకు ధన్యవాదాలు చెప్పి ఆయనకు అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేసే ప్రయత్నం చేశారని, కానీ, తన సీనియర్ల ఆమోదం లేకుండా తాను ట్రంప్‌తో మాట్లాడబోనని ఆయన నిరాకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. -
‘నేను రాజీనామా చేయను’.. ట్రంప్ ఫైర్
న్యూయార్క్: భారతీయ సంతతికి చెందిన అమెరికన్ అటార్నీ ప్రీత్ బరారాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గం ఫైర్ అయ్యింది. ఉన్నపలంగా తన పదవికి రాజీనామా చేయాలంటూ వచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోకుండా తాను రాజీనామా చేయబోనని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా పరిపాలన హయాంలో నియమితులైన 46మంది ఫెడరల్ అటార్నీలు ఉన్నపలంగా రాజీనామా చేయాలంటూ ట్రంప్ పరిపాలన వర్గం ఆదేశాలు జారీ చేసింది. ‘నేను రాజీనామా చేయలేదు. దీంతో కొద్ది సేపటికే కిందే ట్రంప్ పాలనా వర్గం నాపై కోప్పడింది. నా వ్యక్తిగత జీవితంలో అమెరికాలోని సౌతర్న్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్‌కు అటార్నీగా ఉండటం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అంటూ ప్రీత్ బరారా తన వ్యక్తిగత ట్విట్టర్ పేజీలో రాసుకొచ్చారు. అమెరికాలోని అవినీతికి వ్యతిరేకంగా చాలా కఠినంగా వ్యవహరించే వాళ్లలో భరారా ఒకరు. వాస్తవానికి నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ప్రీత్ భరారా ఆయనను కలిసి అభినందనలు తెలిపారంట. ఆ సమయంలో అటార్నీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, మీరు పదవిలో కొనసాగవచ్చని ట్రంప్ ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. అయితే, తాజాగా ఫెడరల్ యాక్టింగ్ అటార్నీలు అంతా కూడా రాజీనామా చేయాలని ఆదేశించడంతో భరారా కార్యాలయం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందని సమాచారం. తనను ట్రంప్ అధికారంలోనే ఉండమన్నారని రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో ట్రంప్ వర్గం ఆయనపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం
అమెరికాలో 46 మంది అటార్నీలకు ఉద్వాసన! వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రీత్ బరారాతో పాటు మరో 45 మంది అటార్నీలకు ఉద్వాసన పలకడానికి అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన వీరంతా రాజీనామా చేయాలని కోరింది. మొత్తం 93 మంది అటార్నీలు ఉండగా.. వారిలో ఇప్పటికే పలువురు రాజీనామా చేశారు. ఏకరూప పరివర్తన తీసుకురావడానికి ఇప్పటికీ కొనసాగుతున్న 46 మందిని రాజీనామా చేయాల్సిందిగా యూఎస్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ కోరారని న్యాయశాఖ ప్రతినిధి సారా ఇస్గుర్ ఫ్లోరెస్ తెలిపారు. జార్జి బుష్, బిల్ క్లింటన్ హయాంలో కూడా ఇలానే చేశారని తమ చర్యను సమర్థించుకున్నారు. -
మరో ఇండియన్‌కు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్ అమెరికన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ ప్రీత్ బరారాను తన హయాంలోనూ కొనసాగించేందుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారా మూడో భారత సంతతి అమెరికన్‌ను ఆయన తన అధికార యంత్రాంగంలోకి తీసుకున్నట్టయింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రీత్ బరారాను అమెరికా అటార్నీగా నియమించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, సెక్యూరిటీస్ స్కాంలు వంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించి పేరుప్రఖ్యాతాలు సాధించిన బరారా బుధవారం ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ తనను పదవిలో కొనసాగమని కోరారని, అందుకు తాను సమ్మతి తెలిపానని బరారా విలేకరులకు తెలిపారు. ట్రంప్ న్యూయార్క్ వాసి, గత ఏడేళ్లుగా తమ కార్యాలయం అందిస్తున్న సేవలు ఆయనకు తెలుసునని, అమెరికా అటార్నీగా గత ఏడేళ్లలో నిర్భయంగా, స్వతంత్రంగా, ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా తాము సేవలు అందించామని తెలిపారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ అధికార యంత్రాంగంలో చేరిన మూడో ఇండియన్ అమెరికన్ బరారా. ఇప్పటికే సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ, మెడికేర్ సర్వీసెస్‌కు చెందిన సీమా వర్మ ట్రంప్ యంత్రాంగంలోనూ కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. -
దేవయానిపై అరెస్ట్ వారంట్
తాజాగా అమెరికా అభియోగపత్రం అక్కడికి వెళితే అరెస్టు చేసే అవకాశం వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం: భారత్ న్యూయార్క్: అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వీసా మోసం వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేవయానిపై శనివారం అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. పనిమనిషి సంగీతా రిచర్డ్‌కు తక్కువ జీతం చెల్లించడంతో పాటు ఆమెను వేధింపులకు గురిచేసిందనే అభియోగాలపై డిసెంబర్ 12న దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమెను భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. అయితే దేవయానికి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున గతంలో ఆమెపై ఉన్న కేసును బుధవారం అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. పాత చార్జిషీట్‌పై అరెస్ట్ చేయకూడదని చెప్పిన కోర్టు.. మరోసారి అభియోగపత్రాన్ని దాఖలు చేసే విషయాన్ని మాత్రం తోసిపుచ్చలేదు. కేసు కొట్టివేయడంపై అమెరికా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసిన దరిమిలా మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేసినట్లు మన్‌హటన్‌లోని అమెరికా ప్రభుత్వ న్యాయవాది, భారత సంతతికి చెందిన ప్రీత్ బరారా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జికి లేఖ ద్వారా తెలిపారు. తన పనిమనిషి వీసా దరఖాస్తు విషయంలో అన్నీ తెలిసుండే దేవయాని తప్పుడు సమాచారంతో పాటు పలు తప్పుడు ప్రాతినిధ్యాలు ఇచ్చారని తాజా చార్జిషీట్లో పేర్కొన్నారు. చార్జిషీట్‌కు సంగీత ఉద్యోగ ఒప్పంద పత్రాన్ని, భారత్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా జతచేశారు. భారత్‌లో దేవయాని ఇచ్చిన సమాచారానికి, అమెరికా ఎంబసీకి తెలిపిన సమాచారానికి మధ్య చాలా వ్యత్యాసముందని కోర్టుకు తెలిపారు. దీనిని బట్టి బాధితురాలి వీసా ఇంటర్వ్యూ సమయంలో ఖోబ్రగడే అమెరికా ఎంబసీని మోసం చేశారని, న్యాయసూత్రాలను అతిక్రమించారని తాజా చార్జిషీట్లో అభియోగాలు నమోదు చేశారు. భారత్ ఘాటు హెచ్చరిక దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేయడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇదొక అనవసరపు చర్య అని పేర్కొన్న భారత్.. దీని ప్రభావం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై పడుతుందని హెచ్చరించింది. భారత్ దృష్టిలో ఆ కేసులో ఏవిధమైన యోగ్యతలు లేవని, దేవయాని కూడా భారత్ తిరిగి వచ్చేయడంతో అమెరికా కోర్టు పరిధిలో లేరని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు. మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడంపై చాలా అసంతృప్తిగా ఉన్నామన్నారు. -
దేవయానికి మర్యాద చేశాం.. కాఫీ కూడా ఇచ్చాం!!
అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేను అసలు ఏమాత్రం అవమానించలేదట. పైపెచ్చు ఆమెకు కాఫీ కూడా ఇచ్చారట, సొంత కారులో కాసేపు ఫోన్లు మాట్లాడుకోడానికి అనుమతించారట!! ఇవన్నీ చెబుతున్నది ఎవరో కాదు. అమెరికాలోని భారత సంతతి అటార్నీ ప్రీత్ బరారా. అమెరికాలో అసలు దేవయానికి అవమానమే జరగలేదని, అంతా చట్టప్రకారమే చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెయ్యి పదాలతో కూడిన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. అసలు దేవయానికి సంకెళ్లు వేయలేదని, మర్యాద చేశామని అన్నారు. ఆమె ఇంట్లో పనిమనిషి సంగీతా రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి తరిమేశారని, ఆమెను నోరు తెరవకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బలవంతంగా సంగీతను భారత్ రప్పించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ ఏజెంట్లు దేవయానిని అరెస్టుచేసిన మాట నిజమే గానీ, ఆమెకు మాత్రం సంకెళ్లు వేయలేదని బరారా చెప్పారు. ఓ మహిళా డిప్యూటీ మార్షల్ ప్రత్యేకమైన గదిలో దేవయానీ ఖోబ్రగాదేను 'పూర్తిగా' గాలించారని, ధనవంతులైనా, పేదలైనా, అమెరికన్లయినా, కాకపోయినా అందరికీ ఆ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆమెకు తాము కాఫీకూడా ఇచ్చామని, తన పిల్లవాడి సంరక్షణ చూసుకోడానికి ఫోన్ కాల్స్ చేసుకోడానికి కూడా అనుమతించామని చాలా గొప్ప పని చేసినట్లు చెప్పారు. బయట బాగా చల్లగా ఉన్నందున కారులో కూర్చునే ఫోన్లు చేసుకోడానికి అనుమతించామన్నారు. పౌరహక్కులు, చట్టాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అమెరికా న్యాయవాదులదా లేక భారత ప్రభుత్వం, ఆ దేశ దౌత్యవేత్తలదా అని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని పరిరక్షించడం, బాధితులను కాపాడటం, చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎవరైనా సరే వారిని బాధ్యులుగా చేయడం, వాళ్ల సామాజిక హోదా ఏదైనా సరే, వాళ్లు ఎంత ధనవంతులైనా, శక్తిమంతులైనా సరే ఒకే న్యాయాన్ని అమలుచేయడమే తమ బాధ్యత అని ప్రీత్ బరారా గొప్పగా చెప్పుకొన్నారు. సంగీతా రిచర్డ్‌కు పాస్‌పోర్టు కూడా లేనందున ఆమెకు తాత్కాలికంగా చట్టబద్ధమైన హోదా కల్పించి, అమెరికాలోనే ఉండి పనిచేసుకోడానికి అనుమతించినట్లు ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది డానా సుస్మన్ తెలిపారు.