మరో ఇండియన్‌కు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్ అమెరికన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ ప్రీత్ బరారాను తన హయాంలోనూ కొనసాగించేందుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారా మూడో భారత సంతతి అమెరికన్‌ను ఆయన తన అధికార యంత్రాంగంలోకి తీసుకున్నట్టయింది.
అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రీత్ బరారాను అమెరికా అటార్నీగా నియమించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్, సెక్యూరిటీస్ స్కాంలు వంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించి పేరుప్రఖ్యాతాలు సాధించిన బరారా బుధవారం ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ తనను పదవిలో కొనసాగమని కోరారని, అందుకు తాను సమ్మతి తెలిపానని బరారా విలేకరులకు తెలిపారు. ట్రంప్ న్యూయార్క్ వాసి, గత ఏడేళ్లుగా తమ కార్యాలయం అందిస్తున్న సేవలు ఆయనకు తెలుసునని, అమెరికా అటార్నీగా గత ఏడేళ్లలో నిర్భయంగా, స్వతంత్రంగా, ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా తాము సేవలు అందించామని తెలిపారు.
త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ అధికార యంత్రాంగంలో చేరిన మూడో ఇండియన్ అమెరికన్ బరారా. ఇప్పటికే సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ, మెడికేర్ సర్వీసెస్‌కు చెందిన సీమా వర్మ ట్రంప్ యంత్రాంగంలోనూ కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే.