‘ట్రంప్ ఫోన్ చేశారు.. ఆయనే మాట్లాడలేదు’
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అటార్నీగా పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్ ప్రీత్ బరారాకు ఫోన్ చేసి మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని శ్వేతసౌదం తెలిపింది. అయితే, ఆయనే ఫోన్ ఎత్తలేదని పేర్కొంది. గత గురువారమే ట్రంప్ ఆయనకు ఫోన్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారని వెల్లడించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన హయాంతో బరారాతోపాటు దాదాపు 46మందిని అటార్నీలుగా నియమించారు.
ప్రస్తుతం ట్రంప్ పాలన రావడంతో ఆ స్థానాలు భర్తీ చేసేందుకు ఒబామా హయాంలో నియమించబడిన అధికారులంతా కూడా ఉన్నపలంగా తమ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశించారు. అయితే, గతంలోనే ట్రంప్‌ను కలిసిన బరారా ఆయన కొనసాగేందుకు అనుమతి తీసుకున్నట్లు చెబుతూ తాను బాధ్యతల నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. దీంతో తనపై ట్రంప్ అధికార వర్గం తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బరారా మీడియాకు చెప్పారు.
ఈ నేపథ్యంలో స్పందించిన వైట్ హౌస్ తాము ముందే బరారాకు ఈ విషయం చెప్పామని, ఆయనే అందించిన విలువైన సేవలకు ధన్యవాదాలు చెప్పి ఆయనకు అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేసే ప్రయత్నం చేశారని, కానీ, తన సీనియర్ల ఆమోదం లేకుండా తాను ట్రంప్‌తో మాట్లాడబోనని ఆయన నిరాకరించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారు.