వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్‌కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు.
చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్‌పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్‌లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్‌లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి.
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
Published Thu, Mar 5 2020 4:23 AM | Last Updated on Thu, Mar 5 2020 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment