Helmand
-
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్‌కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్‌పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్‌లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్‌లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
సహోద్యోగులను చంపిన ‘ఉగ్రపోలీసు’
కాందహార్: అఫ్గాన్ లో సహోద్యోగులపై ఓ పోలీసు దారుణానికి తెగబడ్డాడు. సోమవారం అఫ్గాన్ లోని హెల్మాండ్‌లోని దక్షిణ ప్రాంతం సమీపంలోని ఓ చెక్‌పోస్టు వద్ద సహోద్యోగులపై తాలిబన్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో 11 మంది పోలీసులు మృతి చెందారు. పోలీసు శిబిరంలో నిద్రిస్తున్న పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. కాల్పుల అనంతరం పోలీసు శిబిరంలో ఉన్న ఆయుధాలను తీసుకుని పారిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. -
అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పై దాడి
- తాలిబన్ల దుశ్చర్యలో యూఎస్ సైనికుడి మృతి, మరొ ఇద్దరికి గాయాలు - అఫ్ఘానిస్థాన్ లోని హెల్మండ్ ఫ్రావిన్స్ లో ఘటన యుద్ధం ముగిసిన సుదీర్ఘ కాలం తర్వాత అఫ్ఘానిస్థాన్ నుంచి తన సైన్యాన్ని వెనక్కి రప్పించాలని భావిస్తున్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ అఫ్ఘాన్ లోని హెల్మండ్ ఫ్రావిన్స్ లో యూఎస్ ఆర్మీ మెడికల్ హెలికాప్టర్ పై తాలిబన్లు జరిపిన దాడిలో స్పెషల్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన సైనికుడు ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హెల్మండ్ లోని మర్జా పట్టణంలో తిరిగి విస్తరించిన తాలిబన్ల ఏరివేతకు అమెరికా- అఫ్ఘాన్ సైన్యాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో గయపడ్డ సైనికులకు చికిత్స్ అందించేందుకు వెళ్లిన మెడికల్ హెలికాప్టర్ పై తాలిబన్లు రాకెట్ లాంచర్లతో దాడి చేశారని, స్వల్పంగా ధ్వంసమైనప్పటికీ హెలికాప్టర్ ఎయిర్ బేస్ కు తిరిగిచ్చిందని, ఈ సంఘటనలో ఒక సైనికుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.