దేవయానీ ఖోబ్రగాదే
అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేను అసలు ఏమాత్రం అవమానించలేదట. పైపెచ్చు ఆమెకు కాఫీ కూడా ఇచ్చారట, సొంత కారులో కాసేపు ఫోన్లు మాట్లాడుకోడానికి అనుమతించారట!! ఇవన్నీ చెబుతున్నది ఎవరో కాదు. అమెరికాలోని భారత సంతతి అటార్నీ ప్రీత్ బరారా. అమెరికాలో అసలు దేవయానికి అవమానమే జరగలేదని, అంతా చట్టప్రకారమే చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెయ్యి పదాలతో కూడిన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. అసలు దేవయానికి సంకెళ్లు వేయలేదని, మర్యాద చేశామని అన్నారు. ఆమె ఇంట్లో పనిమనిషి సంగీతా రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి తరిమేశారని, ఆమెను నోరు తెరవకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బలవంతంగా సంగీతను భారత్ రప్పించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
అమెరికా విదేశాంగ శాఖ ఏజెంట్లు దేవయానిని అరెస్టుచేసిన మాట నిజమే గానీ, ఆమెకు మాత్రం సంకెళ్లు వేయలేదని బరారా చెప్పారు. ఓ మహిళా డిప్యూటీ మార్షల్ ప్రత్యేకమైన గదిలో దేవయానీ ఖోబ్రగాదేను 'పూర్తిగా' గాలించారని, ధనవంతులైనా, పేదలైనా, అమెరికన్లయినా, కాకపోయినా అందరికీ ఆ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆమెకు తాము కాఫీకూడా ఇచ్చామని, తన పిల్లవాడి సంరక్షణ చూసుకోడానికి ఫోన్ కాల్స్ చేసుకోడానికి కూడా అనుమతించామని చాలా గొప్ప పని చేసినట్లు చెప్పారు. బయట బాగా చల్లగా ఉన్నందున కారులో కూర్చునే ఫోన్లు చేసుకోడానికి అనుమతించామన్నారు. పౌరహక్కులు, చట్టాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అమెరికా న్యాయవాదులదా లేక భారత ప్రభుత్వం, ఆ దేశ దౌత్యవేత్తలదా అని ఆయన ప్రశ్నించారు.
చట్టాన్ని పరిరక్షించడం, బాధితులను కాపాడటం, చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎవరైనా సరే వారిని బాధ్యులుగా చేయడం, వాళ్ల సామాజిక హోదా ఏదైనా సరే, వాళ్లు ఎంత ధనవంతులైనా, శక్తిమంతులైనా సరే ఒకే న్యాయాన్ని అమలుచేయడమే తమ బాధ్యత అని ప్రీత్ బరారా గొప్పగా చెప్పుకొన్నారు. సంగీతా రిచర్డ్కు పాస్పోర్టు కూడా లేనందున ఆమెకు తాత్కాలికంగా చట్టబద్ధమైన హోదా కల్పించి, అమెరికాలోనే ఉండి పనిచేసుకోడానికి అనుమతించినట్లు ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది డానా సుస్మన్ తెలిపారు.