దీటుగా స్పందిస్తున్న భారత్
వీసా కేసులో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదేను అరెస్టు చేయడం పట్ల భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. అగ్రరాజ్యం అమెరికా అడుగులకు ఇన్నాళ్లూ మడుగులు ఒత్తుతూ వస్తున్న భారత్.. తొలిసారిగా జూలు విదిల్చింది. మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు అందరూ తమ గుర్తింపుకార్డులను భారత విదేశాంగ శాఖకు అప్పగించేయాలని ఆదేశించింది. అంతేకాదు, దేవయాని విషయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడానికి ఢిల్లీ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరస్కరించారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ కూడా అమెరికా డెలిగేషన్‌ను కలిసేందుకు నిరాకరించారు.
దాంతోపాటు అమెరికా నుంచి అన్ని రకాల దిగుమతులను భారత్ ఆపేసింది. అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్లకు జారీ చేసిన అన్ని ఎయిర్పోర్టు పాస్లను భారత్ ఉపసంహరించుకుంది. అమెరికన్ రాయబార కార్యాలయం వెలుపల భద్రత కోసం ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను కోరింది. వాళ్లు ఎలా వ్యవహరిస్తే తామూ అలాగే ఉంటామని, చెప్పుదెబ్బకు అదే స్థాయిలో సమాధానం ఇస్తామని మన దౌత్యవర్గాలు ఆవేశంగా వ్యాఖ్యానించాయి.
కాగా, దేవయాని పట్ల అమెరికా చాలా నీచంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్‌కు అలవాటుపడినవారిని ఉంచే జైలు గదిలో ఆమెను ఉంచారు. దీనిపై భారత్ అమెరికాకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ప్రవాస భారతీయుల శాఖ మంత్రి వయ్‌లార్ రవి మండిపడ్డారు. అయితే, అమెరికా మాత్రం ఖోబ్రగాదే తన పనిమనిషికి గంటకు కేవలం మూడు డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని, అది కనీస వేతనాల కంటే చాలా తక్కువని అంటున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలు తమకు సమ్మతం కాదని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఈ సమస్యను వీలైనంత మర్యాదపూర్వకంగా పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికన్ కాన్సులేట్లలో భారతీయ సిబ్బందికి ఎంత వేతనం చెల్లిస్తున్నారు, అలాగే అమెరికన్ అధికారులు తమ ఇళ్లలో పనిచేసేవాళ్లకు ఎంత జీతం ఇస్తున్నారనే విషయాలను కూడా భారత్ కూపీ లాగుతోంది. అమెరికన్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వీసా వివరాలు, వాళ్ల బ్యాంకు ఖాతాలు, జీతాల వివరాలు కూడా తెలుసుకుంటోంది. అమెరికన్ ఎంబసీలకు దిగుమతి క్లియరెన్సులను స్తంభింపజేశారు. ఇవి ఆరంభం మాత్రమేనని, దేవయాని విషయంలో సరిగా వ్యవహరించకపోతే మరిన్ని కఠిన చర్యలు ఎదురవుతాయని దౌత్యాధికారులు చెబుతున్నారు.