దేవయాని కేసు కొట్టివేయడంపై అమెరికా ఆశ్చర్యం
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు కొట్టివేయడంపై ఒబామా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ‘‘భారత మాజీ డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయానిపై అభియోగాలు చెల్లవంటూ న్యాయస్థానం కొట్టివేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి జెన్ ప్సకి వ్యాఖ్యానించారు. వీసా మోసం కేసు విషయంలో దేవయానిని అమెరికా పోలీసులు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్టు చేయడం, తర్వాత బట్టలు విప్పి తనిఖీలు చేయడం, క్రూర నేరస్థులతోపాటు జైలులో పెట్టడంతో భారత, అమెరికా మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన న్యూయార్క్ కోర్టు.. దేవయానికి పూర్తిస్థాయి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున ఆమెపై నమోదు చేసిన అభియోగాలు చెల్లవని పేర్కొంటూ బుధవారం తీర్పునిచ్చింది. కాగా, దేవయానిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేయడాన్ని ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐ) యూఎస్‌ఏ చైర్మన్ జార్జ్ అబ్రహం స్వాగతించారు.