దేవయానిపై మళ్లీ కేసు
న్యూయార్క్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వీసా మోసం అభియోగాలతో నమోదైన కేసును అమెరికా కోర్టు కొట్టేసిన మరునాడే ఆమె పై మళ్లీ కేసు నమోదు అయింది. పని మనిషి వీసా కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం, వీసా మోసానికి పాల్పడ్డారన్న అభియోగాలను ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం ఆమెపై తిరిగి నమోదు చేశారు. మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టులో ఈ మేరకు దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. కాగా వీసా మోసం కేసులో దేవయానిని అమెరికా పోలీసులు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్టు చేయడం, దుస్తులు విప్పి తనిఖీ చేయడం, క్రిమినల్స్‌తోపాటు ఒకే చెరలో ఉంచడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన విషయం తెలిసిందే. దేవయానిపై కేసును కోర్టు కొట్టివేసినా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మళ్లీ నేరాభియోగాలు మోపడంతో వివాదం తిరిగి మొదటికొచ్చినట్లైంది.