దేవయానికి ఊరట..
అగ్రరాజ్యానికి షాక్
భారత దౌత్యవేత్తపై అభియోగాలు కొట్టేసిన అమెరికా కోర్టు
కొత్త అభియోగాలు నమోదు చేసేందుకు యత్నాలు
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా-భారత్‌ల మధ్య ఆగ్రహ జ్వాలలకు ఆజ్యం పోసిన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కేసులో మనకు ఓ ఆశావహ పరిణామం. దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు బుధవారం కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ ఈ మేరకు 14 పేజీల తీర్పు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో భారత వ్యవహారాల అధికారిగా ఆమె నియామకాన్ని అమెరికా జనవరి 8న ఆమోదించిందని, అప్పటి నుంచి ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ లభించిందని జడ్జి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 9న ఆమెపై నమోదు చేసిన అభియోగాలు చెల్లవని స్పష్టంచేశారు.
ఆమెపై ఎలాంటి అరెస్టు వారెంట్లు ఉన్నా అవి ఇక రద్దవుతాయని తెలిపారు. అభియోగాల్లో పేర్కొన్న ఆరోపణలు.. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా చేసినవి కాకుంటే.. ప్రాసిక్యూషన్ కొత్త అభియోగాలు నమోదు చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని పేర్కొన్నారు. దేవయాని తరఫు న్యాయవాది డీనియల్ అర్షక్ కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేసు కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు. ఈ విషయంలో అమెరికా తగిన విధంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు.
దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే స్పందిస్తూ.. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి, అధికారులకు తాము రుణపడి ఉంటామన్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో దేవయాని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
మళ్లీ అభియోగాలు నమోదు: దేవయానిపై కొత్త అభియోగాలు నమోదు చేయకూడదని కోర్టు చెప్పలేదని, కాబట్టి దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అమెరికా తెలిపింది. అమెరికాలో ఈ కేసు వ్యవహారాలు చూస్తున్న మన్‌హటన్ అటార్నీ ప్రీత్ భరారా ప్రతినిధి జేమ్స్ మీడియాతో మాట్లాడుతూ.. దౌత్యరక్షణ వర్తించదన్న తమ వాదనను కోర్టు కొట్టేసిందన్నారు. అయితే వీసా కేసులో ఆమె చెప్పిన అబ ద్ధాలు దౌత్య కార్యక్రమాల పరిధిలోకి రావు కాబట్టి.. ఆ దిశగా కేసు పెట్టే ఆలోచన చేస్తామన్నారు.