భారత్కు తిరిగొస్తున్న దేవయాని | Devayani Khobragade formally indicted by US court, on way back home | Sakshi
Sakshi News home page

భారత్కు తిరిగొస్తున్న దేవయాని

Published Fri, Jan 10 2014 10:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

భారత్కు తిరిగొస్తున్న దేవయాని

భారత్కు తిరిగొస్తున్న దేవయాని

భారతీయ దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగడేపై ఎట్టకేలకు అమెరికా గ్రాండ్ జ్యూరీ నేరాన్ని నిర్ధరించింది.  అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా కోరడంతో ఆమె తిరిగి భారత్ వస్తున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. ''దేవయానీ ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయల్దేరారు" అని అందులో చెప్పారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి, పూర్తిగా దుస్తులు విప్పి వెతకడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్లో అరెస్టయినప్పుడు భారత్ తరఫున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం నాడు ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తిచేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాదులు తెలిపారు.

మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓప్రకటన విడుదల చేసింది. ''న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది'' అని ఆ ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమీ తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement