ప్రభుత్వ పక్షాన ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, అవి సఫలీకృతం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
ప్రభుత్వ పక్షాన ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, అవి సఫలీకృతం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం విరమించిన తర్వాత ఆయనతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పద్మనాభం దీక్ష విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా పెట్టి అమలుచేయాలని సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిందని, సమస్య శాశ్వత పరిష్కారం కోసమే ఈ కమిషన్ వేశారని తెలిపారు.
ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగానే జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను పూర్తి చేయాలని అనుకుంటున్నారన్నారు. తుని ఘటనలో బయటి నుంచి కొంతమంది వచ్చారని, మరికొందరు తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ ఘటనపై చాలా కేసులు బుక్ చేశామని, వాటిపై లోతైన దర్యాప్తు జరిపి.. వారిపైనే కఠిన నిర్ణయాలు ఉంటాయని, దాంతో సంబంధం లేనివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలూ సంయమనంతో ఉండాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చూసి రెచ్చిపోకూడదని సూచించారు.