వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు వారు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడానికి ఆమె చేస్తున్న దీక్షకు ఉద్యోగుల పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
విభజన నిర్ణయంపై గత 15 రోజులుగా సచివాలయంలో ఆందోళనలు నిర్వహిస్తున్నామని, తమ నిరసన కార్యక్రమాలకు వైఎస్‌ఆర్ సీపీ పూర్తిగా సంఘీభావం తెలిపిందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఛైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తమ ఆందోళనల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు.