'ఆత్మబలిదానం చేస్తే నా డబ్బుతో విగ్రహం పెట్టిస్తా'
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆత్మబలిదానం చేస్తే తన డబ్బుతో మహబూబ్నగర్ గడియారం సెంటర్లో విగ్రహం పెట్టిస్తానని కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2019లోపు పూర్తిచేస్తే 2019లో తాను, మరో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ జెండాలు మోస్తామన్నారు. ఒకవేళ ఆ పథకాలు పూర్తి కాకపోతే మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు టీడీపీ జెండాలు మోస్తారా అని ప్రశ్నించారు. సీడబ్ల్యుసీకి రాసిన లేఖలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. అయినా.. జూన్ 11న ఏపీ అధికారులు లేఖ రాస్తే, హరీశ్ రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
కృష్ణాజలాలపై జూన్ 18, 19 తేదీలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్ అడిగారు. అసలు ప్రభుత్వం పాలమూరు జిల్లా బంద్కు పిలుపునివ్వడంలో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. అయినా.. హరీశ్రావే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాజెక్టు సాధించొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ఆయన ఆత్మబలిదానం చేస్తే తన డబ్బుతో విగ్రహం పెట్టిస్తానని వ్యాఖ్యానించారు.