సాగునీరివ్వకపోతే ఆమరణదీక్ష
► ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రిధర్‌రెడ్డి
► ఇరిగేషన్ కార్యాలయంలో బైఠాయింపు
► కాంట్రాక్టర్‌కు అధికారుల మద్దతుపై మండిపాటు
నెల్లూరు(మినీబైపాస్): నెల్లూరు రూరల్ మండలంలోని మాదరాజుగూడూరు, కాకుపల్లి, లింగాయపాళెం రైతులకు రెండో పంట సాగుకు నీళ్లివ్వకపోతే ఆమరణదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయా గ్రామాల రైతులతో కలిసి బుధవారం ఆయన నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్‌ఈ గది ఎదుట బైఠాయించారు. ఎడగారు సాగుకు నీళ్లివ్వాలని రైతులు అనేక మార్లు కోరినా ఫలితం కరువైందన్నారు. సోమశిల డ్యాంలో సరిపడా నీళ్లున్నాయని, మరో వైపు వర్షాలు కురుస్తున్నా అధికారులు నీటి విడుదలకు నిరాకరించడం సరికాదన్నారు. నీళ్లు వదిలితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు ఇబ్బంది అని చెప్పడం దారుణమన్నారు. కాంట్రాక్టర్ ప్రయోజనం కోసం వేలాది ఎకరాల్లో పంట పండించే రైతుల కడుపు కొడతారా..అని ప్రశ్నించారు.
ఈ ప్రాంతంలోని పొలాలకు 15 క్యూసెక్కుల నీరు ఇస్తామని వారం కిందట అంగీకరించిన అధికారులు ఇప్పుడు కాంట్రాక్టర్ కోసం మాటమారుస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఎకరా పొలం కూడా ఎండనీయబోమని ఓ వైపు జిల్లా మంత్రి చెబుతున్నారని, ఆయన మాటకు ఇరిగేషన్ అధికారులు విలువనివ్వరా అని నిలదీశారు. ఎస్‌ఈ వెంటనే కార్యాలయానికి చేరుకుని సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భీక్ష్మించారు. మరోవైపు రైతులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశాలతో ఎస్‌ఈ పీవీ సుబ్బారావు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, రైతులతో చర్చలు జరిపారు. 22వ తేదీన సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆరోజు సానుకూల నిర్ణయం రాకపోతే ఆమరణదీక్షకు దిగుతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలోవైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు తిరుపాల్, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.