పార్టీ మారాలని నెల్లూరు మేయర్ దంపతులకు బెదిరింపులు
లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు
భయంతో వైఎస్సార్‌సీపీకి మేయర్ దంపతుల రాజీనామా
నెల్లూరు (బారకాసు): ఎన్నికలు ముగియగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు మేయర్ దంపతులను బెదిరించి రాజకీయ అరాచకానికి తెరతీశారు. గిరిజన మహిళ రిజర్వేషన్‌తో వైఎస్సార్‌సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పోట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌లను పార్టీ మారాలని, లేదంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. నిస్సహాయ స్థితిలో ఆ గిరిజన దంపతులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, నేతలను టీడీపీలో చేరాలంటూ ఎన్నికలకు ముందు నుంచే శ్రీధర్‌రెడ్డి బెదిరింపులకు దిగారు.
కొందరిపై రాజకీయంగానూ కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో మరింతగా బెదిరింపులకు దిగుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్ నుంచి పోట్లూరి స్రవంతి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈ డివిజన్ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్రవంతి దంపతులు అప్పట్లో వైఎస్సార్‌సీపీలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులుగా కొనసాగేవారు.
అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సహకారంతో స్రవంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. 9 నెలల క్రితం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో మేయర్ స్రవంతి దంపతులు, కొందరు కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు. కొద్దిరోజుల్లోనే స్రవంతి దంపతులు తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు.
జరిగిందిదీ..
నెల్లూరు నగరంలో దాదాపు 70 భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే తనఖా చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వచ్చిందంటూ ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మేయర్ భర్త జయవర్ధన్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్ విచారణకు ఆదేశించారు.
గతంలో తన వెంట ఉండి, వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్న మేయర్ దంపతులను తన దారికి తెచ్చుకునేందుకు, వారిపై పెత్తనం సాగించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఈ ‘ఫోర్జరీ’ ఫిర్యాదును ఆయుధంగా ఉపయోగించుకున్నారు. టీడీపీలో చేరితే కేసులు ఉండవని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో భయపడిన ఆ గిరిజన దంపతులు నిస్సహాయ స్థితిలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment