పార్టీని బతికించిందే తానంటూ కోటంరెడ్డి ఆత్మస్తుతి
తన అనుచరులతో పార్టీలో తానే నంబర్ వన్ అంటూ భజనకీర్తన
పార్టీ జెండా ఆవిష్కరించి మంత్రి నారాయణను అవమానించిన వైనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు టీడీపీలో అంతర్గత ఆధిపత్యం ఆరంభమైంది. పార్టీలో ఏ హోదా లేకపోయినా.. పార్టీ అంటే తాను, తానంటే పార్టీ అంటూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు తాను గొప్పగా పొగుడుకుంటే.. పార్టీలో కోటంరెడ్డి నంబర్ వన్ అయితే.. రెండో వ్యక్తి నారాయణ, పార్టీని బతికించిన మూడో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అంటూ తన అనుచరులతో భజన కీర్తన ఉదంతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏసీనగర్ సెంటర్‌లో టీడీపీ జెండాను కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆవిష్కరించారు. సాధారణంగా పార్టీ జెండా ఆవిష్కరణను ఫ్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన నారాయణతో చేయించడం గౌరవనీయం.
అయితే పార్టీలో ఏ పదవి లేని కోటంరెడ్డి ఆధిపత్యం చాటుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే ఆ పార్టీ తో యుద్ధం ప్రారంభించానని, మిగతా వారంతా మూడేళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటూ పరోక్షంగా నారాయణపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు నెల్లూరు సిటీలో పార్టీ బతికిందంటే తన వల్లేనంటూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పుకొచ్చారు. తన రాజకీయ భవిష్యత్ కొందరి వల్ల లేకుండా పోయిందని, తన జీవితమంతా ఒకరికి పల్లకిలు మోసే బతుకై ందంటూ వాపోయారు. ఓ వైపు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి పొంగూరు నారాయణపై అక్కసు వెళ్లగక్కుతూనే మరో వైపు ఆయన్ను సిటీని అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడంటూ కీర్తించడం కొసమెరుపు.
ఇదే సమయంలో అదే డివిజన్ ఇన్‌చార్జి నేత మాట్లాడుతూ నెల్లూరు నగరంలో టీడీపీ నేతలంటే నంబర్ వన్ కోటంరెడ్డి అయితే.. నారాయణ రెండో వ్యక్తిగా, వేమిరెడ్డి మూడో వ్యక్తిగా అభివర్ణించాడు. ఈ కార్యక్రమం ద్వారా తనను తాను పొగుడుకోవడం, తన అనుచరులతో కీర్తించుకోవడం కోసమే కాకుండా.. నెల్లూరు నగరంలో తన ఆధిపత్యం చాటుకునే ప్రయత్నమే అనే సందేశాన్ని పంపారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోటంరెడ్డితో పాటు టీడీపీకి చెందిన డివిజన్ ఇన్‌చార్జిలను నారాయణ పక్కన పెట్టేశారు. వారికి ఏ విధంగా సంబంధం లేకుండానే తన సొంత యంత్రాంగంతో ఎన్నికలను నిర్వహించుకున్నారనే అక్కసును ఈ విధంగా వెలిబుచ్చుతున్నారని ఆ పార్టీ కేడర్ చెవులు కొరుక్కోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment