నిమ్స్ నుంచి విన్స్ వరకు..
- కేసీఆర్ ఆమరణదీక్షకు కేంద్రమైన నిమ్స్
- ఇక్కడినుంచే ఉవ్వెత్తున ఉద్యమం
- డిసెంబర్ 9న ప్రకటనతో తెలంగాణపై ఆశలు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిమ్స్‌ది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. ఇక్కడ కేసీఆర్ ఆమరణదీక్ష చేయడం వల్లే 2009 డిసెంబర్9న కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆనాటి నుంచి మొదలైన రాష్ట్ర ఉద్యమం ఊరూవాడా విజృంభించి తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న సిద్దిపేట వేదికగా ఆమరణదీక్షను చేపట్టేందుకు కరీంనగర్ నుంచి బయల్దేరగా మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి, ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు.
అక్కడి న్యాయమూర్తి ఆయనకు 14రోజుల రిమాండ్ విధించడంతో జైల్లోనే దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి చెందిన ఫిజిషియన్ మాధవరావు, కార్డియాలజిస్టు నరహరి, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యంతో కూడిన వైద్యబృందం ఖమ్మం సబ్‌జైలుకు వెళ్లి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని సమీక్షించారు. ఇదే సమయంలో కేసీఆర్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ జిల్లాలన్ని అట్టుడికి పోయాయి.
విద్యార్థుల నిరసనలతో ఉస్మానియా క్యాంపస్ హోరెత్తిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో ఖమ్మం సబ్‌జైలు నుంచి హుటాహుటిన ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. 30న ఆయనకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో తెలంగాణవాదుల నుంచి పెద్దెత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంకా తాను దీక్ష విరమించలేదని, కొన సాగిస్తున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం నుంచి నిమ్స్‌కు తరలింపు : కేసీఆర్ కోరిక మేరకు డిసెంబర్ 3న ఆయన్ను ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. దీంతో తెలంగాణ ఉద్యమానికి నిమ్స్ కేంద్రబిందువుగా మారింది. మిలీనియంబ్లాక్‌లోని రూమ్‌నెం. 228కు ఆయన్ను తరలించి, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈసీజీ, బీపీ, షుగర్, పరీక్షలు నిర్వహించారు.
అర్థరాత్రి ఐసీయూకు తరలింపు : శరీరంలో సోడియం, పోటాషియం, ఎలక్ట్రోలైట్స్ శాతం పడిపోవడంతో ఆయన్ను ఐసీయూకి తరలించారు. కేసీఆర్ కోమాలోకి వెళ్లారనే వదంతులు తెలంగాణవాదులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీక్షకు మద్దతుగా అప్పట్లో 48 గంటల బంద్‌కు పిలుపినిచ్చారు. రాళ్లదాడులు, బాష్పవాయుగోళాలు, లాఠీదెబ్బలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అట్టుడికింది. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసు,మీడియా వాహనాలను ధ్వంసం చేశారు.
ఇదే సమయంలో కేసీఆర్‌ను పరామర్శించేందుకు విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు నిమ్స్‌కు క్యూకట్టడంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి సీఎం రోశయ్య, టీడీపీ నేత చంద్రబాబు సహా ఇలా అనేకమంది నిమ్స్‌కు తరలివచ్చి కేసీఆర్‌ను పరామర్శించారు. అప్పటి పరిస్థితిపై ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆయా పార్టీల అభిప్రాయాలను ఢిల్లీకి పంపించారు.
డిసెంబర్ 9 అర్ధరాత్రి దీక్ష విరమణ : కేసీఆర్ దీక్ష, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. కాంగ్రెస్ కోర్‌కమిటీ రెండుసార్లు సమావేశమై..చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9 రాత్రి 11.30 గంటలకు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సుముఖతను వ్యక్తం చేయడంతో కేసీఆర్ దీక్ష విరమించేందుకు అంగీకరించారు. ప్రొ.జయశంకర్ కేసీఆర్‌కు అర్థరాత్రి 12.30 గంటలకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు.