తనను ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు.
విజయవాడ : తనను ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. మీడియాను చూసి తనను గొల్లపూడి వద్దే అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని ఉమ నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఆయన గొల్లపూడి నుంచి దీక్షా శిబిరానికి బయల్దేరారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి దేవినేని ఈరోజు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్‌లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. అయితే ఈసారి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.