సీమాంధ్రలో సోనియా భజన దర్బార్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తగ్గేది లేదంటూ సమైక్యవాదులు శివాలెత్తుతున్నారు. రోజుకో తీరులో ఉద్యమిస్తూ కేంద్రానికి నిరసనను తెలియజేస్తున్నారు. మంగళవారం కూడా ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, ర్యాలీలు జరిగాయి. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు వినూత్నంగా తమ నిరసనలు తెలుపుతున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. నిరసనలు తెలియచేయటంలోనూ సృజనాత్మకత కొట్టొచ్చినట్టు కనపడుతోంది. నాయకులపై చురకలు, సెటైర్లు, వేయడంలో సమైక్యవాదులు వెనకడుగు వేయట్లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల తీరుని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సీమాంధ్రలో సోనియా భజన దర్బార్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ సోనియా, రాహుల్ వేషధారణతో సమైక్యవాదులు తమ నిరసనలు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమవుతోంది. అల్లూరు మండలంలో సమైక్యవాదుల సకల జనుల మహాధర్నా చేశారు. భారీ జాతీయ పతాకం చేతబూని సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతన్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు నేడు సీమాంధ్ర ప్రజలను మోసం చేయటానికే బస్సుయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరులో ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. వివిధ ప్రజా సంఘాలు.. విద్యార్థి, ఉపాధ్యాయ జేఏసీల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ర్యాలీలు జరిగాయి. కళాకారులు వివిధ వేషదారణలతో తమ నిరసన తెలిపారు. డప్పు చప్పుళ్ళు, మేళతాళాలతో పట్టణమంతా హోరెత్తించారు.
ఇటు విజయవాడలో డాక్టర్లు కదం తొక్కారు. సమైక్యాంధ్ర నినాదాలతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా 'మహా వైద్య గర్జన' పేరుతో పదమూడు జిల్లాలకు చెందిన ఐఎమ్‌ఎ కార్యవర్గ సమావేశం జరుగుతుండగానే... సబ్ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయాలే అంతిమంగా అమలు చేయాల్సి ఉంటుందని.. ఇప్పటివరకు కేంద్రం సమైక్య ఉద్యమ విషయంలో స్పందించకపోయినా... త్వరలో తల వంచక తప్పదని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో 'మహా వైద్య గర్జన' ప్రారంభమైంది.
అత్యవసర సేవలు మినహా ప్రైవేటు ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి. ర్యాలీగా వచ్చిన వైద్యులు సబ్‌కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఇక విజయవాడలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ... స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో రోజుకో వినూత్న రీతిలో నిరసన జరుగుతోంది. ఇవాళ బెంజి సర్కిల్ వద్ద గొర్రెలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో ఉద్యోగ జెఎసి చేస్తున్న ఆందోళనలతో హోరెత్తుతోంది. పలు శాఖల ఉద్యోగులు రిక్షాలు తొక్కి తమ నిరశన వ్యక్తం చేసారు. సీమాంధ్ర వాసుల్ని నిరుపేదలను చేయడానికే విభజన నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ జెఎసి ఆరోపించింది. ఇక టీడీపీ నేత అంబిక కృష్ణను సమైక్య వాదులు నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమైక్యవాదుల దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన ఆయనను నిలదీశారు. టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. విజయనగరం మయూరి జంక్షన్‌లో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. విద్యార్థులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. రెండో బొబ్బిలిగా పేరొందిన భీమవరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు లక్షగళ ఘోషకు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. నిరసనకారులతో పట్టణం నిండిపోయింది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులనే తేడాలేకుండా అంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశనాయకులు, తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో భీమవరం మార్మోగిపోయింది.
ఇక రాష్ట్ర విభజనకు నిరసనగా రాజమండ్రి మహిళా కళాశాల విద్యార్థినులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోనియాగాంధీకి చెప్పులు, కేంద్రమంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు బహుకరించి తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
సమైక్యాంధ్ర ఉద్యమంకు మద్దతుగా అనంతపురంలో ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన సమైక్యవాదులు, విద్యార్ధులతో అనంతపురం కిక్కిరిసిపోయింది.సమైక్య వాదం బలంగా వినిపించేందుకు ఉద్యోగులు, విద్యార్ధులు, ఉద్యమకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉద్యమాన్ని బలంగా రూపోందిస్తున్నామని ఉద్యోగ జేఏసీ తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిపోతోంది. పెద్దఎత్తున ప్రజలు లక్ష గళ ఘోషలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకఠంతో స్పష్టం చేశారు.