సీపీఐ నారాయణకు సమైక్య సెగ
అనంతపురం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సమైక్య సెగ తగలింది. ఆయనను సమైక్యవాదులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయనను అనంతపురం పర్యటనకు రావద్దంటూ పార్టీ నేతలు సూచించారు. సీపీఐ తెలంగాణకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. దాంతో నారాయణ అనంతపురంలో పర్యటిస్తే సమైక్యవాదులు నిరసనలతో పాటు అడ్డుకుంటారనే అనుమానంతో పర్యటనను రద్దు చేసుకోవాలని జిల్లా పార్టీనేతలు నారాయణను కోరారు.
అయితే రాష్ట్ర విభజన అనివార్యమనే అంచనాకు వచ్చిన సీపీఐ సీమాంధ్రుల్ని సముదాయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది.
మరోవైపు అనంతపురం జిల్లాలో తొమ్మిదో రోజు కూడా బంద్ కొనసాగుతోంది.త జిల్లావ్యాప్తంగా 940 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కాగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేపీ శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.