సీమాంధ్రుల్ని సముదాయించడమెలా?
Published Mon, Aug 5 2013 2:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజన అనివార్యమనే అంచనాకు వచ్చిన సీపీఐ.. సీమాంధ్రుల్ని సముదాయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారం హైదరాబాద్‌లో వివిధ రంగాల నిపుణులు, మేధావులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి తెలంగాణవాది, నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగరరావు, వ్యవసాయ రంగ నిపుణుడు కేఆర్ చౌదరి, పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డి, రాంనరసింహారావు సహా పలువురు ఎన్జీవో నేతలు, విద్యుత్ రంగ నిపుణులు టీవీ చౌదరి, వీరయ్య తదితరులు హాజరయ్యారు.
3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జల, విద్యుత్ వనరుల పంపిణీ, ఉద్యోగుల అభద్రత, అసమాన అభివృద్ధి, యువతలో నెలకొన్న నైరాశ్యం, ఆంధ్రా అభివృద్ధికున్న అవకాశాలు, ఉద్రిక్తతల నివారణ, రాయలసీమ అభివృద్ధి గురించి చర్చించారు. హైదరాబాద్ చుట్టూ కాకుండా మిగతా జిల్లాల్లో కూడా అభివృద్ధి జరిగి ఉంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తేది కాదని సమావేశంలో పలువురు వివరించారు. జల వనరుల పంపిణీలో అన్యాయానికి తావుండదని, సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నవి కేవలం అపోహలేనని, వాటిని చర్చించి పరిష్కరించుకోవచ్చని విద్యాసాగరరావు వివరించారు. ఆదాయ పంపిణీ, ఉద్యోగుల బదిలీ వంటివి చట్ట ప్రకారమే జరుగుతాయని ఎన్జీవో నేతలు స్పష్టం చేశారు. వ్యవసాయానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన ఆవశ్యకతను కేవీఆర్ చౌదరి వివరించారు. కొత్త రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్యాలకున్న అవకాశాలను హరిశ్చంద్రప్రసాద్ వివరించారు. అన్ని రంగాల వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత విస్తృత స్థాయిలో రెండు రాష్ట్రాల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ నిర్ణయించింది.
నేడు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం..
తెలంగాణ ప్రకటన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కార్యదర్శులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Advertisement