తగలబెట్టినా వెనక్కి తగ్గం: నారాయణ
తమ దిష్టిబొమ్మలు కాదు.. తమను తగలబెట్టినా రాష్ట్ర విభజనపై తమ విధానం మారదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వారు 23జిల్లాల్లోనూ ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతాల ప్రజల అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు పెచ్చరిల్లాయి. జాతీయ నాయకులను విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. విభజనకు మద్దతు పలికిన నాయకుల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. రాష్ట్ర విభజనపై నోరెత్తని నాయకుల దిష్టిబొమ్మలకు శవయాత్రలు, పిండ ప్రదానాలు నిర్వహించారు.
మరోవైపు రాష్ట్ర విభజన అనివార్యమయితే సీమాంధ్రుల్ని ఎలా సముదాయించాలనే సీపీఐ కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారం హైదరాబాద్‌లో వివిధ రంగాల నిపుణులు, మేధావులతో చర్చలు జరిపారు.