రెండుచోట్ల రెండు రకాల పొత్తులు
సీపీఐ ఎన్నికల వ్యూహం
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో పొత్తు
సీమాంధ్రపై నేడు సమావేశం: నారాయణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాలలో రెండు రకాల పొత్తులతో ముందుకు వెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. రెండు ప్రాంతాలలో ఒకే రకమైన ఎత్తుగడతో ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదని రాష్ట్ర పార్టీ భావించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు శనివారం సీపీఐ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి నాయకత్వంలో ఆ ప్రాంత ఎన్నికల కమిటీ సమావేశమైంది. అనంతరం నారాయణ ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తాము అంటరాని పార్టీగా చూడడం లేదన్నారు. శుక్రవారం యూదృచ్ఛికంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశానని, పొత్తుల అంశం చర్చకు రాగా సానుకూల వైఖరి వ్యక్తమైనట్టు చెప్పారు. సీపీఎంను కూడా తమతో కలుపుకొనిపోయే విధంగా చర్చిస్తున్నామన్నారు. కేసీఆర్‌తోనూ పొత్తుల అంశంపై ఫోనులో సంప్రదించినట్టు తెలిపారు. సీపీఐ, సీపీఎంల మధ్య మున్సిపల్, స్థానిక ఎన్నికలలో కలిసి పనిచేసే విషయంపైనే అవగాహన కుదిరిందని, రాష్ట్ర స్థాయి ఎన్నికల పొత్తుపై చర్చించేందుకు ఈ నెల 21న తాము మరోసారి భేటీ కానున్నట్టు చెప్పారు. సీమాంధ్రలో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఆ ప్రాంత ఎన్నికల కమిటీ సభ్యులతో ఆదివారం విజయవాడలో సమావేశం కానున్నట్టు వివరించారు.
20 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్ల గుర్తింపు
తెలంగాణ ప్రాంతంలో పొత్తులపై చర్చ సందర్భంగా ఆయా పార్టీల వద్ద ఎలాంటి ప్రతిపాదనలు ఉంచాలన్న దానిపై శనివారం నాటి పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నేతలు చర్చించారు. 20 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను ప్రతిపాదించి, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని నిర్ణయించారు. గత ఎన్నికలలో పార్టీ పోటీ చేసిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కనీసం ఒక్క లోక్‌సభ సీటుకైనా పార్టీ పోటీ చేసేలా ఆయా పార్టీలతో అవగాహనకు రావాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, మాన కొండూరు, రామగుండం.. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్.. నల్లగొండ జిల్లా మునుగోడు, దేవరకొండ.. ఖమ్మం జిల్లా వైరా, పినపాక, కొత్తగూడెంలతో పాటు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు, ఇతర అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 అసెంబ్లీ సీట్లకు, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ సీట్లకు ఆయా పార్టీల ముందు ప్రతిపాదనలు ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు.