న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు సీపీఐ తెలిపింది. తెలంగాణ నోట్ ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం సరైన చర్యగానే అభిప్రాయపడింది. ఈమేరకు సీపీఐ జాతీయ కార్యవర్గం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తమకు అంగీకారమేనని తెలిపింది. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాన్ని విరమించి తదుపరి చర్యలకు కేంద్రాన్ని సంప్రదిస్తే బాగుంటుందని సూచించింది. సీమాంధ్రులకు ఉద్యోగ భద్రత, నదీజలాల తదితర అంశాలపై గందరగోళ పరిస్థితులు ఉన్నందున వాటిపై కేంద్రతో చర్చించాలని తెలిపింది. హైదరాబాద్ తో కూడిన10 జిల్లాల తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో గురువారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ నోట్ ను ఆమోదించారు. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.