వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు తాము సైతం అంటున్నాయి జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు. బుధవారం కూడా సంఘీభావంగా అంత టా ఆందోళనలు చేపట్టారు.
చోడవరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు తాము సైతం అంటున్నాయి జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు. బుధవారం కూడా సంఘీభావంగా అంత టా ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకో, మానవహారాలు నిర్వహించారు. చోడవరంలో పీవీ ఎస్‌ఎన్ రాజు, ముర్లోతు ముత్యాలనాయుడు, యర్రంశెట్టి శ్రీనివాసరావుల ఆమరణ దీక్ష శిబిరాన్ని పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు, కొయ్య ప్రసాద్‌రెడ్డి, జి.వి.రవిరాజు, సత్తి రామకృష్ణారెడ్డి, బోళెం నర్సింహమూర్తి సందర్శించి మద్దతు తెలిపారు.
ఎలమంచిలి ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని వైఎస్ విగ్రహంవద్ద పులపర్తి, పిఎన్‌ఆర్ పేట గ్రామాలకు చెందిన కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద జాతీయరహదారిపై డీసీసీబీ మాజీ డెరైక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనకాపల్లిలోని కొణతాల పెదబాబు నాయకత్వంలో 20 మంది దీక్షలు ప్రారంభించారు.
కశింకోటలో మరో 15మంది దీక్షలు చేస్తున్నారు. వీరిని దాడి రత్నాకర్ పరామర్శించారు. ఇక్కడే జాతీయరహదారిపై పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సోనియాగాంధీ, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తగరపువలసలో వైఎస్సార్‌సీపీ నేత కోరాడ రాజబాబు సహా మరో 7మంది ఆమరణదీక్షను మంగళవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోనే రాజబాబు సహా మరో ముగ్గురు దీక్ష కొనసాగిస్తున్నారు. నర్సీపట్నంలో సమన్వయకర్త పెట్ల ఉమాశంకరగణేష్ ఆధ్వర్యంలో 15మంది దీక్షలు ప్రారంభించారు.
మునగపాక మెయిన్‌రోడ్డుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మానవహారం చేపట్టాయి. జగన్ దీక్షకు మద్దతుగా మునగపాక పంచాయతీ పాలకవర్గం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. సుమారు 20మంది పాల్గొన్నారు. అరకులోయ పాత బస్టాండ్ వద్ద రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. దీనికి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. పార్టీ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, సివేరి దొన్నుదొర, పెదలబుడు సర్పంచ్ సమర్దిలు దీక్షదారులను పరామర్శించారు.