ఏపీ సీఎం అవినీతిని అసెంబ్లీలో ఎండగడతాం
* వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ప్రకటన
* ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
* విభజనతో నష్టపోయిన ఏపీకి బాబు పాలనతో మరింత నష్టం
* బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం
* పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం
* పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, మోసపూరిత పాలనను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతామని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ప్రకటించింది.
పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం పార్టీ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన వందల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాజధాని ప్రకటన చేసినరోజు ప్రతి జిల్లాకూ ఏవేవో చేస్తానని మాటలు చెప్పారని, కానీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పట్టిసీమ, రాజధాని, ఇసుక ఇలా ప్రతిదాంట్లోనూ ప్రభుత్వ అవినీతి కనిపిస్తోందన్నా రు. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేయడమేతప్ప పూర్తిచేసే అలవాటు లేదన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీ ఇప్పుడు చంద్రబాబు పాలనతో మరింత నష్టపోతోందన్నారు.
ఈ నేపథ్యంలో తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలమంతా సమష్టిగా అసెంబ్లీలో ప్రజాసమస్యల్ని ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమన్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత ఏరోజు ఇవ్వాలన్న దానిపై పార్టీలో చర్చించుకుంటున్నామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకట్రెండు రోజుల్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా?
సీఎం రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి ఆ ప్రాంతానికి అది చేశా, ఇది చేశానని ప్రకటనలు చేయడమేతప్ప.. ఈ రెండేళ్లలో ప్రజలకుపయోగపడే పని ఏ ఒక్కటైనా పూర్తిచేశారా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎంస్థాయి వ్యక్తి అక్రమ భవనంలో ఉంటే రాష్ట్రంలో మంచిపాలనకు ఇంకేమి అవకాశముంటుందన్నారు. పట్టిసీమ కట్టేసా.. రాయలసీమకు నీళ్లొస్తాయని ప్రచారం చేశారు.. ఇప్పటికి సీమకు చుక్కనీరైనా ఇచ్చారా? అని నిలదీశారు.
పట్టిసీమ పేరుతో రాయలసీమకు నీళ్లిస్తానని మోసం చేసిన చంద్రబాబు తక్షణమే సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విజయవాడలో మంత్రులతో నిర్వహిస్తున్న సమావేశాలు ఏవి మంత్రివర్గ సమావేశాలో.. ఏవి పార్టీ సమావేశాలో కూడా అర్థంకాని తీరున జరుగుతున్నాయన్నారు. మంత్రివర్గ సమావేశాల్ని పార్టీ సమావేశాల మాదిరిగా నిర్వహించడం రాష్ట్రచరిత్రలో మునుపెన్నడూ జరగలేదన్నారు. అమెజాన్, గూగుల్ సంస్థలు తమ బ్రాంచీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని, మైక్రోస్టాఫ్ రెండో సంస్థను అక్కడే ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అయితే ప్రపంచమంతా తనవైపే చూస్తోందంటూ చంద్రబాబు సదస్సుల పేరుతో వందలకోట్లు ఖర్చు పెడుతున్నారుగానీ.. ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రావట్లేదని విమర్శించారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేరికల్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇంకో సీఎం అయితే రాజీనామా చేసేవారు
రాజధాని భూదందాలో సీఎం, ఆయన బినామీలు, ఆయన కుమారుడు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల బాగోతం సాక్ష్యాధారాలతో బట్టబయలయ్యాక మరొకరైతే ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసివుండేవారని శ్రీధర్‌రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబులాంటి వ్యక్తి నుంచి రాజీనామా ఆశించడం ఆడియాసే అవుతుందని.. కనీసం విచారణకైనా ఆయన సిద్ధపడాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు బయటకు పొక్కనీయమని సీఎం, మంత్రులుగా ప్రమాణం చేసి.. రాజధాని ప్రకటనకు మూడు నెలలముందే కొందరు ముఖ్యులు, వారి బినామీలతో రాజధాని ప్రాంతంలో భూములు కొనిపించడం నేరం కాదా? అని ప్రశ్నించారు.