అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి | Naidu international reputation for corruption | Sakshi
Sakshi News home page

అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి

Published Fri, Mar 4 2016 3:50 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి - Sakshi

అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి

 
  వెంకటాచలం(మనుబోలు): ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో మాత్రం అంతర్జాతీయ ఖ్యాతి సాధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన  వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయం విశ్రాంతి మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజులుగా రాజధాని నిర్మాణం పేరుతో మంత్రులు, వారి బినామీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు కాజేశారో, ప్రస్తుతం వాటి విలువెంతో పత్రికల్లో వార్తలొస్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. ప్రభుత్వంలో పెత్తనం చెలాయించే వారు, ప్రభుత్వానికి అండదండగా ఉంటున్న వారు రాజధాని నిర్మాణంలో కోట్లు పోగేసుకుంటున్నారన్నారు.

పేద రైతుల నుంచి తక్కువ ధరకు భూములు లాక్కున్నారన్నారు. ఆ భూముల్లో కోర్ క్యాపిటల్ అని చెప్పి వ్యాపారానికి అనుగుణంగా ఉండే విధంగా వాటిని నమోదు చేయించారన్నారు. మిగిలిన వాటిని మాత్రం గ్రీన్ జోన్ అని చెప్పి వ్యాపారం చేయడం ఇంత కన్నా ఘోరం ఉండదన్నారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడ్ని చరిత్రలో చూడలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో బినామీల పేరుతో వేల కోట్లు పోగేసుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్‌ను న్యాయస్థానాలే తప్పుపట్టినా దోషులను శిక్షించడంతో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ప్రశ్నించారు. వారికి చెందిన హాయ్‌ల్యాండ్‌ను చినబాబు లోకేష్ నొక్కేయడంతో వారిపై ఈగ వాలనీయడం లేదన్నారు. ప్రజలను, రైతులను మోసం చేసి రాజధాని నిర్మాణం పేరుతో వేల ఎకరాలు కాజేసి వాటితో వ్యాపారం చేయడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి ముసుగులో ఇంత దారుణమైన దోపిడీని ఎక్కడా చూడలేదన్నారు.

రైతులను మోసం చేసిన వారు ఎవరూ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సం పాదించుకున్న దాఖలాల్లేవన్నారు. దీనికి చంద్రబాబు అతీతుడు కాదన్నారు. తాను నిప్పునని, తనంత నీతిమంతుడు లేడని డబ్బా కొట్టుకునే చంద్రబాబు వేల కోట్ల అవినీతిలో చిక్కుకున్నారు కాబట్టి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. బాబు నిజాయితీపరుడైతే రాజధాని భూకుంభ కోణంపై సుప్రీం కోర్టు జడ్జి, సీబీఐలచేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, ఎంపీపీ అరుణమ్మ, నాయకులు చెంచుకృష్ణయ్య, శ్రీధర్‌నాయుడు, రజనీకాంత్‌రెడ్డి, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement