సాక్షి, హైదరాబాద్: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ బీజేపీని నిలదీశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వరప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన, అవినీతిని ఆయన ఎండగట్టారు. ‘టీడీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట. నాలుగేళ్లుగా అబద్ధాలు, అవినీతితో బాబు పాలన సాగిస్తున్నారు. ఎంతో అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం దేశంలో ధనిక సీఎం చంద్రబాబే. దేశంలోనే ఏపీ ఇప్పుడు అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. రాజధాని భూముల్లో అంతా అవినీతే. అలాంటి వ్యక్తిపై బీజేపీ నేతలు కేసులు ఎందుకు పెట్టడం లేదు’ అని వరప్రసాద్ అన్నారు.
‘రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. జగన్ దోషి అని ఏ కోర్టు చెప్పింది?.. రాజకీయ కక్షలతో ఆయనపై కేసులు పెట్టారన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే కోర్టు నుంచి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు. దమ్ముంటే.. అంత నిజాయితీ పరుడైతే విచారణను ఎదుర్కోవాలి’ అని వరప్రసాద్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జాతీయ, అంతర్జాతీయ సర్వేల్లో సైతం ఏపీ అవినీతి గురించి ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment