విదేశీ పెట్టుబడికి దాసోహం
కాకినాడ సిటీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువురూ విదేశీ పెట్టుబడులకు దాసోహమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి విమర్శించారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రచారజాతాను ప్రారంభించారు. ఎన్నికల హామీలను నీటిమూటలుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని మరో వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రూ.15లక్షలు జమ చేస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో నల్లధనం తెల్లగా మారిపోయేందుకు అవకాశం కల్పించారన్నారు.
24 నెలల్లో 22 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. బాబు వస్తే జాబు అనే మాటను ముఖ్యమంత్రి మరచి విదేశీ కంపెనీలకు అవకాశాలు ఇస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, నాయకులు ఎంవీ రమణ, దుర్గాప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.