ఫిరాయింపులే చంద్రబాబు క్యారెక్టరా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు క్యారెక్టరా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. తన వ్యక్తిత్వం, అనుభవం గురించి ప్రతి రోజూ గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి విరుద్ధంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఘనత అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించడం విడ్డూరమన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది తమ వాడైన స్పీకరే కనుక ఇబ్బంది లేదని, ఎవరూ రాజీనామాలు చేయవద్దని వారికి చెప్పడం చట్టవిరుద్ధమన్నారు. అధికారబలంతో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడితే.. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రతిపక్షంగా మారతారన్నారు.
వారు సభ్యత్వాలు కోల్పోతారు: ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇపుడు పార్టీ మారిన వారు సభ్యత్వాలను కోల్పోతారని రాజేంద్ర వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారని, సవరణల తర్వాత 2003లో దానిని పకడ్బందీగా రూపొందించారన్నారు. అనర్హతపై స్పీకర్ దే పూర్తి అధికారం అని న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పదో షెడ్యూలులోని 7వ పేరాలో ఉందని చెబుతున్నారని, ఈ వాదన సరికాదని బుగ్గన అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు.