కలెక్టరేట్ ఎదుట కరువుపై పోరు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, పార్టీశ్రేణులు, ధర్నాకు హాజరైన రైతులు, కార్యకర్తలు
కడప కార్పొరేషన్: జిల్లాలోని రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆత్మాహుతికైనా సిద్ధపడతామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా, రైతాంగాన్ని ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోవడం లేదన్నారు.దీనివల్ల బాబు వస్తే కరువు మామూలే అన్న పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, పంట నష్టపరిహా రం ఇవ్వాలని అధికారులు లెక్కలు వేసి పంపిస్తే ప్రభుత్వం ఇంతవరకూ మంజూరు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు మొండి బకాయిలుగా మార్చుతున్నారు, రైతులు ఏం పాపం చేశారని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విలాసాలు, జల్సాలకు చార్టెడ్ ఫ్లైట్లు, ఎయిర్‌క్రాఫ్టŠస్‌లో విదేశీ టూర్లకు ఉన్న డబ్బులు రైతులకు ఇవ్వడానికి లేవా అని సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్ ఇన్సూరెన్స్ కార్యాల యం ఎదుట వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేస్తే కొంత బీమా ఇచ్చారని, మిగిలిందంతా పెండింగ్‌లో ఉంచారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వారు కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యా యం చేయాలని కోరారు.ఈ ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మాసీమబాబు, అఫ్జల్‌ఖాన్, తుమ్మలకుంట శివశంకర్, రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం కడప మండల అధ్యక్షుడు ఎం. రాజగోపాల్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు చల్లా రాజశేఖర్, నా గేంద్రారెడ్డి, సీహెచ్ వినోద్, వేణుగోపాల్‌నాయక్,నారుమాధవ్, గురుమోహన్, విజయ్‌ప్రతాప్‌రెడ్డి, షఫీ, ఖాజా, బోలా పద్మావతి, పత్తిరాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, రత్నకుమారి, క్రిష్ణవేణి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నదాతలపై కరుణ లేకపోవడం దారుణం
జిల్లాలో తీవ్ర కరువుకాటకాల వల్ల 3లక్షలకు పైబడి ఎకరాల్లో పంట సాగుచేయలేదు. జిల్లాలోని 51 మండలాను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి సాయం చేయలేదు. కోస్తాలో వరదల వల్ల పంట నష్టపోయిన వారికి హెక్టారుకు 26వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన సీఎం, కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం ప్రకటించకపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి వల్లే 2012–13 రబీ శనగ పంటకు సంబంధించి 3వ విడతగా రావాల్సిన రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ రాలేదు. 2014 రబీలో రుణాలు రీషెడ్యూల్ చేసుకొని రైతులకు రూ.13.69కోట్ల బీమా పెండింగ్‌లో ఉంటే ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5.50కోట్లు చెల్లించాలి. 2015 నాటి ఇన్‌పుట్ సబ్సిడీ ఈనాటికీ రాలేదు. 2010లో అరటి పంట నష్టపోతే ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు నుంచి జిల్లాలోని ప్రాజెక్టులకు నీరివ్వాలంటే ఎస్‌ఆర్‌బీసీకి 12వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప మాజీ ఎంపీ
రైతుల కష్టాలు సీఎం, మంత్రులకు పట్టలేదు
జిల్లాలో లక్షలాదిమంది రైతులు కరువు బారిన పడ్డారు. ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకుండా లంచాలు, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తోంది. వైఎస్ ఐదున్నర సంవత్సరాల్లోనే లక్షా యాభైవేలకోట్లతో జలయజ్ఞం చేపట్టి కోటి ఎకరాలకు నీరందించాలని కలలుగన్నారు. ఎక్కడ కృష్ణానీరు, ఎక్కడ తుంగభద్ర ఆ నీటితో జిల్లాలో 8లక్షల ఎకరాల పారుదల జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు దగ్గరా ఒక్క ఇటుక పేర్చలేదు. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్పా చేసిందేమీ లేదు. 2015, 2016 సంవత్సరాల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకోని రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు. ఈ సమస్యలపై వందలసార్లు కలెక్టర్‌ను కలిశాం. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేస్తామని ఇప్పటికి చేయలేదు. అధికార యంత్రాగం సీఎం సభలకు జనం తోలడానికే తప్పా మరెందుకూ పనికి రావడం లేదు. – పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే
పట్టెడన్నం పెట్టలేని స్థితిలో అన్నదాత
అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత పట్టెడన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇందుకు కారణం చంద్రబాబు ప్రభుత్వమే. గతంలో ఆయన 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు జిల్లా రైతులు వరినారు చూడలేదు. ఇన్సూరెన్స్ గూర్చి పార్లమెంటులో లేవనెత్తినా, హైదరాబాద్ ఏఐసీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలంలో నీరున్నా జిల్లాలోని ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడం లేదు. ఎన్నికల కోసమే రూ.1000 నిరుద్యోగ భృతి ప్రకటించారు.– కె. సురేష్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
కరవు పోవాలంటే బాబు దిగిపోవాలి
నలభై ఏళ్లలో ఇలాంటి కరవు చూడలేదు. ధాతు కరువును మించిన కరువుగా ఉంది. ఐదు నియోజకవర్గాల్లో విత్తనమే పడలేదు. చెనిక్కాయ వేయడానికి అదును పోయింది. మనుషులకే తినడానికి తిండి లేదు, ఇక పశువులకు పశుగ్రాసం ఎక్కడినుంచి వస్తుంది. పాల ఉత్పత్తి 75 శాతం తగ్గిపోయింది. కుందూలో 24వేల క్యూసెక్కుల నీరు నెల్లూరుకు పోతోంది. ఆ నీటిని తెలుగుగంగకు మళ్లిస్తే 1.75లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. నెల్లూరుపై ఉన్న ప్రేమ కడపపై లేదు. జిల్లాపై ఎందుకింత కక్షసాధిస్తున్నారో ఆర్థం కావడం లేదు. ముళ్లు కట్టె తీసుకొని పొడిస్తే తప్పా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు.– ఎస్. రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment