ఓటర్ల తొలగింపుపై జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఓట్లను తొలగించాలంటూ అదే పార్టీ వ్యక్తుల పేరిట దరఖాస్తులు వెల్లువెత్తడం సంచలనమైంది. పార్టీ నేతలు ఊహించినట్లుగానే అధికార టీడీపీకి చెందిన వారు ఈ కుట్రను పన్నారు. అన్ని నియోజకవర్గాలలోనూ ఓట్ల తొలగింపునకు సంబంధించి భారీగా దరఖాస్తులు అందినట్లు కలెక్టరే స్వయంగా గురువారం అంగీకరించారు. ఎవరు దరఖాస్తు చేసిందీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులకు హామీ ఇచ్చారు.
కడప సెవెన్‌రోడ్స్ : ఓట్లు తొలగింపునకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరి కిరణ్ స్పష్టంచేశారు. స్వయానా ఓటరు ఫారం–7పై సంతకం చేయడం ద్వారా సమ్మతి తెలియజేస్తేనే తొలగింపు సాధ్యపడుతుందన్నారు. వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓటు ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమ్మతితో ఒకచోట ఉంచి మరోచోట ఓటు తొలగిస్తారన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పులు, చేర్పులపై శుక్రవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీలతో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ పన్నిన పన్నాగంపై సాక్షిలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టరు నిర్వహించిన సమావేశం ప్రాథాన్యత సంతరించుకుంది. సమావేశంలో కలెక్టరు వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు.
ఒక నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు ఫారం–7లు 0.1 శాతం కంటే అధికంగా వస్తే రిటర్నింగ్ అ«ధికారి, జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెక్ చేసి చర్యలు తీసుకుంటారన్నారు. ఫారం–7లు 37 వేలు వచ్చాయని పేర్కొన్నారు. బద్వేలులో 7000, రాజంపేటలో 3500, కడపలో 4000, రైల్వేకోడూరులో 3500, రాయచోటిలో 3000, పులివెందులలో 2500, కమలాపురంలో 5000, జమ్మలమడుగులో 2300, మైదుకూరులో 3500, ప్రొద్దుటూరులో 2100 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా 90 శాతం వచ్చాయన్నారు. అధికారులు విచారించగా ఫారం–7లు తాము సమర్పించలేదని చాలాచోట్ల ప్రజలు చెబుతున్నారన్నారు. ఇలాంటి తప్పుడు అర్జీలు ఏ కంప్యూటర్ నుంచి వచ్చాయో తెలుసుకుని సైబర్ క్రైం సెల్‌కు పంపుతామన్నారు. తప్పుడు అర్జీదారులు, నెట్ సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మకు ఆదేశాలున్నాయని తెలిపారు.
అందుబాటులో పోలింగ్ కేంద్రాలు
గ్రామీణ ప్రాంత పోలింగ్ కేంద్రాల్లో 1200, అర్బన్ ప్రాంతాల్లో 1400 కంటే మించి ఓటర్లుంటే అదే లొకేషన్‌లో యాగ్జిలరి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికి జిల్లాలో 13 యాగ్జిలరి కేంద్రాలు ఏర్పాటుకు ఈసీని అనుమతి కోరామన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ఇంకా సాగుతున్నందున పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 35 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పునకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. రాజకీయ పార్టీల ఆమోదం కూడా పొందామన్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబం«ధించి 25 ఫిర్యాదులు ఇచ్చామన్నారు. కార్పొరేటర్ హరూన్‌బాబు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలోచాలాచోట్ల పాత ఇంటి నెంబర్లే ముద్రించారని, అలాంటి వారిని ఓటుకు అనుమతిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ జాబితాలో పేరుంటే ఓటు వేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో 13 చోట్ల పోలింగ్ కేంద్రాల లొకేషన్లు మార్చాలని గతంలో కోరినా ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియడం లేదన్నారు. ఒక పోలింగ్ కేంద్రాన్ని పునరుద్ధరించాలన్నారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. బి.మఠంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కోరారు. ఓట్ల తొలగింపు కోసం వస్తున్న తప్పుడు దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. రామాపురం మండలం దూదేకులపల్లె ఓటర్లను పర్వతరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రానికి మార్చాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కోరారు. ఇందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో రఘునాథ్, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకుడు కానుగదానం, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, మద్దిలేటి, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, మనోహర్, జనసేన నాయకుడు గుర్రప్ప, బీజేపీ నాయకుడు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment