వాల్‌పోస్టర్లు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ర్టంలోని పట్టణాలు, నగరాల్లో అనుమతి లేకుండా గోడలపై రాతలు రాయటం, పత్రికలు అతికించడాన్ని నిషేధిస్తూ త్వరలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొక్కలు, నీటి సంరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేకంగా అదనపు మార్కులు కేటాయిస్తామన్నారు. గురువారం దుర్గాఘాట్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాస్తవ తనిఖీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
దీనికోసం రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ డ్రోన్ కెమెరా అందిస్తామన్నారు. ఒక్కో డ్రోన్ కెమెరా ఏడు గంటల్లో 150 కిలోమీటర్ల పరిధిలోని వాస్తవ పరిస్థితిని రికార్డు చేస్తుందన్నారు. కైజలా యాప్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించి తిరిగి వారికి చేరవేస్తుందన్నారు.
కేంద్రం నుంచి 1,700 కోట్లు రావాలి
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ జరిగిన, జరగాల్సిన పనుల వివరాలను సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ర్టం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ. 1,700 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా ఈ ఏడాది రూ. మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిధులు విడుదల చేయాలన్నారు.