
మల్లవల్లిలో ప్లాస్టిక్ పార్క్
బాపులపాడు మండలం మల్లవల్లిలో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్....
► రూ.1000 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ
► 250 ఎకరాలు కేటాయిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
► మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీరపనేనిగూడెంలో 25 ఎకరాలు
► సూరంపల్లిలో ‘సిపెట్’ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
► విజయవాడను ప్లాస్టిక్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి వెల్లడి
గన్నవరం రూరల్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రోత్సహించే అగ్రి ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. గన్నవరం మండలం సూరంపల్లిలో కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) నిర్మాణ పనులకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, వెంకయ్యనాయుడు, హన్స్‌రాజ్ గంగారాం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ దీనిపై ప్రకటన చేశారు. 200 నుంచి 250 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే అగ్రి ప్లాస్టిక్ పార్క్‌ను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసే సిపెట్ ద్వారా ఏడాదికి మూడువేల మందికి వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ అందించనున్నామన్నారు. అగ్రికల్చర్ ప్లాస్టిక్ ఇంజనీర్లు, టెక్నీషియన్లను విజయవాడ సిపెట్ నుంచే తయారు చేసుకోవాల్సి ఉందన్నారు. విజయవాడ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో పేరున్న ప్లాస్టిక్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హామీ ఇచ్చారు.
మల్లవల్లిలో 250 ఎకరాలు...
ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అగ్రి పార్కు కోసం మల్లవల్లిలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్ వినియోగంపై విస్తృత పరిశోధనలు అవసరమన్నారు. ప్లాస్టిక్ మైక్రాన్స్ పెంచి రీసైక్లింగ్ చేయాల్సి ఉందని, పర్యావరణం, ప్లాస్టిక్ వినియోగాన్ని సమతుల్యం చేసుకోవాలని చెప్పారు. సూరంపల్లిలో ఉన్న అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఏపీ (ఎలీప్) అభ్యర్థన మేరకు వీరపనేనిగూడెంలో మహిళా పారిశ్రామికవేత్తల నూతన యూనిట్ల కోసం 25 ఎకరాలు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన సిపెట్ కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమన్నారు.
కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, హన్స్‌రాజ్ గంగారాం, వెంకయ్యనాయుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపెట్ డెరైక్టర్ జనరల్ ఎస్‌కే నాయక్, వినయ్‌కుమార్ పాండే, విజయవాడ సిపెట్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు అతిథులను సత్కరించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎ, కెమికల్స్ శాఖ కార్యదర్శి విజయశంకర్ పాండే, ముఖ్య నిర్వాహకులు బి.శ్రీనివాసులు, నాయర్, జోషి, కృష్ణ, ఎంపీపీ కవిత, సూరంపల్లి సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, జేసీ గంధం చంద్రుడు, నూజివీడు, విజయవాడ సబ్ కలెక్టర్లు లక్ష్మీశ, సృజన తదితరులు పాల్గొన్నారు.