Union Minister Ananth Kumar
-
బుట్టాకు ఆహ్వానం.. విజయసాయి ఫైర్
సాక్షి, ఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తీరును వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆహ్వానించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బుట్టా రేణుకను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండా బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంపీపై అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా పార్టీ తరఫున ఎలా పిలుస్తారని కేంద్రమంత్రి అనంతకుమార్‌ను నిలదీశారు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు.. లోకేష్‌కు కనీసం తెలుగు రాదని ఎద్దేవా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వాదనకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అమ్ముడుపోయిన ఎంపీని ఏ అధికారంతో పిలిచారని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం నిబంధనలకు విరుద్ధమని, నీతి బాహ్యమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుక అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. బుట్టారేణుక నేమ్ ప్లేట్ తీసేస్తారా.. సమావేశాన్ని బాయ్‌కాట్ చేయలా అని వైఎస్సార్సీపీ ఎంపీ పేర్కొన్నారు. విధిలేక సమావేశంలో బుట్టా రేణుక నేమ్ ప్లేట్ తొలగించినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ-టీడీపీ కలిసి ఈ పని చేశాయని ఆయన విమర్శించారు. ఈ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ మోదీ ఉన్నప్పుడే మాట్లాడానన్నారు. ‘విభజన హామీలు అమలు చేయాలి. అఖిలపక్ష సమావేశంలో నాలుగు అంశాలు మాట్లాడాను. సీఎం రమేష్‌కు తెలుగు రాదు.. ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకునే వ్యక్తిని ఎంపీని చేసిన ఘనత టీడీపీది. విభజన అంశాలు ప్రస్తావిస్తే ప్రధాని స్పందించలేదు. విశాఖ-చెన్నై కారిడార్ పూర్తి అయినట్లు టీడీపీ చెబుతోంది. ఎక్కడ పూర్తి అయిందో నాకు మాత్రం కనిపంచలేదు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. మహిళల రిజర్వేషన్ల బిల్లును తక్షణమే చట్టం చేయాలి. ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. బుట్టా రేణుక విషయాన్ని నేరుగా ప్రధానికి చెప్పాను. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రప్రయోజనాలను టీడీపీ ఎంపీలు గాలికొదిలేశారు. సీఎం రమేష్ లాంటి వాళ్లను పార్లమెంట్‌కు పంపిస్తే ఏంచేస్తారు? సభా సజావుగా సాగాలనే ఉద్దేశం టీడీపీ ఎంపీలకు లేదు. ప్రజల ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు కాపాడలేరు. హోదా సాధించాలన్న తపన టీడీపీ ఎంపీలకు ఏ మాత్రం లేదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఏపీకి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. హోదా పోరాటాన్ని కొనసాగిస్తాం. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, తెలుగు దొంగల పార్టీ ఎంపీలందరూ కలిసి దాదాపు 26 మంది ఉన్నారు. ఈ దొంగలు విపక్షాలను కలుస్తున్నారు. వాళ్లేం చేస్తారో పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తోంది. ఇది టీడీపీ- బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని’ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. -
ఇది టీడీపీ-బీజేపీ కలిసి అడుతున్న నాటకమే
-
మోదీ శ్రమిస్తుంటే... సిద్దరామయ్య నిద్ర..
శివాజీనగర: దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధోగతికి చేరుకుందని, ఉత్తరప్రదేశ్, త్రిపుర, హర్యానా తదితర రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన సీట్లకంటే అత్యధికంగా స్థానాలు వచ్చాయని, అదే విధంగానే ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఊహించిన అత్యధిక మెజారిటీ వస్తుందని కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిచిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన తరువాత 55 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన చేసిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఆధ్వాన్న స్థితిలో ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 18 గంటల పాటు ప్రజల కోసం శ్రమిస్తుంటే సిద్దరామయ్య 18 గంటల పాటు నిద్రపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్థంగా శాంతిభద్రతలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీ, దొంగతనాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. బీహర్‌లో లాలు ప్రసాద్‌ను సిద్దరామయ్య కూడా అనుసరిస్తూ పరిపాలన చేశారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయ చేస్తూ మత ఘర్షణలు సృష్టించటం లాంటి కార్యకలాపాలు అ«ధికంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందని, అదే విధంగానే యడ్యూరప్ప సంపూర్ణ మెజారిటితో సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిద్దరామయ్య బీజేపీ–జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉందని ప్రచారం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య ఉన్న సంబంధాలు లేవని ప్రజలను నమ్మించటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. యడ్యూరప్ప శివమొగ్గ జిల్లా శికారిపురలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని ఈసారి 50 వేల మెజారిటీతో గెలుపొందుతారని అనంతకుమార్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరిలో ఓటమి తప్పదని తెలుసుకొని బాదామి నుంచి పోటీ చేశారని తెలిపారు. సిద్దరామయ్య రాజకీయ జీవితంలో వలస పక్షిగా ఉన్నాడని, ముందుగా జనతా పార్టీలో ఉండి ఆ తరువాత జనతాదళ, అహింద తరువాత కాంగ్రెస్‌లోకి చేరుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బెంగళూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సదాశివ శెణై, ప్రధాన కార్యదర్శి కిరణ్, రిపోర్టర్స్ గిల్డ్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మల్లవల్లిలో ప్లాస్టిక్ పార్క్
► రూ.1000 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ ► 250 ఎకరాలు కేటాయిస్తున్నామన్న సీఎం చంద్రబాబు ► మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీరపనేనిగూడెంలో 25 ఎకరాలు ► సూరంపల్లిలో ‘సిపెట్’ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన ► విజయవాడను ప్లాస్టిక్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి వెల్లడి గన్నవరం రూరల్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రోత్సహించే అగ్రి ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. గన్నవరం మండలం సూరంపల్లిలో కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) నిర్మాణ పనులకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, వెంకయ్యనాయుడు, హన్స్‌రాజ్ గంగారాం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ దీనిపై ప్రకటన చేశారు. 200 నుంచి 250 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే అగ్రి ప్లాస్టిక్ పార్క్‌ను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసే సిపెట్ ద్వారా ఏడాదికి మూడువేల మందికి వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ అందించనున్నామన్నారు. అగ్రికల్చర్ ప్లాస్టిక్ ఇంజనీర్లు, టెక్నీషియన్లను విజయవాడ సిపెట్ నుంచే తయారు చేసుకోవాల్సి ఉందన్నారు. విజయవాడ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో పేరున్న ప్లాస్టిక్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హామీ ఇచ్చారు. మల్లవల్లిలో 250 ఎకరాలు... ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అగ్రి పార్కు కోసం మల్లవల్లిలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్ వినియోగంపై విస్తృత పరిశోధనలు అవసరమన్నారు. ప్లాస్టిక్ మైక్రాన్స్ పెంచి రీసైక్లింగ్ చేయాల్సి ఉందని, పర్యావరణం, ప్లాస్టిక్ వినియోగాన్ని సమతుల్యం చేసుకోవాలని చెప్పారు. సూరంపల్లిలో ఉన్న అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఏపీ (ఎలీప్) అభ్యర్థన మేరకు వీరపనేనిగూడెంలో మహిళా పారిశ్రామికవేత్తల నూతన యూనిట్ల కోసం 25 ఎకరాలు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన సిపెట్ కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమన్నారు. కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, హన్స్‌రాజ్ గంగారాం, వెంకయ్యనాయుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపెట్ డెరైక్టర్ జనరల్ ఎస్కే నాయక్, వినయ్‌కుమార్ పాండే, విజయవాడ సిపెట్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు అతిథులను సత్కరించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎ, కెమికల్స్ శాఖ కార్యదర్శి విజయశంకర్ పాండే, ముఖ్య నిర్వాహకులు బి.శ్రీనివాసులు, నాయర్, జోషి, కృష్ణ, ఎంపీపీ కవిత, సూరంపల్లి సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, జేసీ గంధం చంద్రుడు, నూజివీడు, విజయవాడ సబ్ కలెక్టర్లు లక్ష్మీశ, సృజన తదితరులు పాల్గొన్నారు. -
విశాఖపట్నంలో నైపర్
♦ విజయవాడ సిపెట్ సామర్థ్యం పెంపు ♦ సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రకటన (విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఇంజనీరింగ్ విద్యకు ఐఐటీ మాదిరిగా.. ఫార్మా విద్యకు ప్రధాన విద్యాసంస్థగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఫార్మా, ఎరువులు-రసాయనాల శాఖ మంత్రి ఎ.అనంతకుమార్ ప్రకటించారు. దీనికోసం రూ. 600 కోట్లు పెట్టుబడి పెడతామని, రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. మూడురోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా మంగళవారం ఆయన ప్రసంగించారు. తన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ అని, తానూ సగం ఆంధ్రానే అని చమత్కరించారు. విజయవాడలోని కేంద్ర ప్లాస్టిక్ ఇన్స్టిట్యూట్ (సిపెట్)లో ప్రస్తుతం ఉన్న డిప్లొమా కోర్సులకు అదనంగా బీటెక్, ఎంటెక్ ప్రవే శపెడుతున్నట్లు వెల్లడించారు. సీట్ల సంఖ్యను 200 నుంచి 5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశంలో మెడికల్ డివైజ్ తయారీ పార్కుల్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, తొలి పార్క్‌ను గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. మరో పార్క్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. పెట్రో కెమికల్, పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ కారిడార్‌ను ప్రస్తావించిన మంత్రి... గుజరాత్, తమిళనాడు, ఒడిశాల్లో పెట్రోలియం కాంప్లెక్స్‌లు రాబోతున్నట్లు చెప్పారు. మరో కాంప్లెక్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నారు. ‘‘పెట్రోలియం రిఫైనరీ విస్తరణకు కనీసం రూ. 20 వేల కోట్లు కావాలి. అలాగే పెట్రో కాంప్లెక్స్‌కు రూ. 25వేల కోట్లు కావాలి. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్నాయి. పెట్రో కాంప్లెక్స్‌ను హెచ్‌పీసీఎల్, గెయిల్ కలిసి ఏర్పాటు చేస్తాయి. కాకపోతే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. త్వరలో స్పష్టత రావచ్చు’’ అని చెప్పారు. ఇవన్నీ వచ్చే బడ్జెట్లో పెట్టే అవకాశం ఉందన్నారు. పారిశ్రామిక కారిడార్‌లో ఇంధన ప్రాజెక్టులు సోలార్ రంగంలో 5వేల మెగావాట్లు, పవన విద్యుత్ రంగంలో 4వేల మెగావాట్లు సాధించాలని ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనంతకుమార్ చెప్పారు. చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్లోను, బెంగళూరు-చెన్నై కారిడార్లోను ఈ ప్రాజెక్టులు వచ్చే అవకాశముందన్నారు. ప్రజల సంతోషమే ప్రగతి సూచిక: గవర్నర్ గజిబిజి గణాంకాల ప్రాతిపదికన కాకుండా ప్రజల సుఖసంతోషాల స్థాయిని కొలమానంగా తీసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆహార, ఆరోగ్య, పర్యావరణ సాధించినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించినట్లు అవుతుందన్నారు. సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ సామాన్యుడికి అంతిమంగా ప్రయోజనం కలిగించగలిగితేనే ఈ సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూలు ఫలవంతమైనట్టని వ్యాఖ్యానించారు. స్విస్ చాలెంజ్ విధానంలో పర్యాటక ప్రాజెక్టులు: స్విస్ చాలెంజ్ విధానం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘టూరిజం ఇన్ ఏపీ - యాన్ ఎకనామిక్ ఏజెంట్’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఐఐ సదస్సులో కుదుర్చుకున్న 27 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూల ద్వారా 17,840 మందికి ఉపాధి కల్పించనున్నామన్నారు.