ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తీరును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆహ్వానించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బుట్టా రేణుకను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండా బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంపీపై అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా పార్టీ తరఫున ఎలా పిలుస్తారని కేంద్రమంత్రి అనంతకుమార్‌ను నిలదీశారు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు.. లోకేష్‌కు కనీసం తెలుగు రాదని ఎద్దేవా చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి వాదనకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అమ్ముడుపోయిన ఎంపీని ఏ అధికారంతో పిలిచారని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం నిబంధనలకు విరుద్ధమని, నీతి బాహ్యమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుక అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. బుట్టారేణుక నేమ్ ప్లేట్ తీసేస్తారా.. సమావేశాన్ని బాయ్‌కాట్ చేయలా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ పేర్కొన్నారు. విధిలేక సమావేశంలో బుట్టా రేణుక నేమ్ ప్లేట్ తొలగించినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ-టీడీపీ కలిసి ఈ పని చేశాయని ఆయన విమర్శించారు. ఈ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ మోదీ ఉన్నప్పుడే మాట్లాడానన్నారు.
‘విభజన హామీలు అమలు చేయాలి. అఖిలపక్ష సమావేశంలో నాలుగు అంశాలు మాట్లాడాను. సీఎం రమేష్‌కు తెలుగు రాదు.. ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకునే వ్యక్తిని ఎంపీని చేసిన ఘనత టీడీపీది. విభజన అంశాలు ప్రస్తావిస్తే ప్రధాని స్పందించలేదు. విశాఖ-చెన్నై కారిడార్ పూర్తి అయినట్లు టీడీపీ చెబుతోంది. ఎక్కడ పూర్తి అయిందో నాకు మాత్రం కనిపంచలేదు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. మహిళల రిజర్వేషన్ల బిల్లును తక్షణమే చట్టం చేయాలి. ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. బుట్టా రేణుక విషయాన్ని నేరుగా ప్రధానికి చెప్పాను.
పార్టీ ఫిరాయింపు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రప్రయోజనాలను టీడీపీ ఎంపీలు గాలికొదిలేశారు. సీఎం రమేష్ లాంటి వాళ్లను పార్లమెంట్‌కు పంపిస్తే ఏంచేస్తారు? సభా సజావుగా సాగాలనే ఉద్దేశం టీడీపీ ఎంపీలకు లేదు. ప్రజల ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు కాపాడలేరు. హోదా సాధించాలన్న తపన టీడీపీ ఎంపీలకు ఏ మాత్రం లేదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఏపీకి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. హోదా పోరాటాన్ని కొనసాగిస్తాం. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, తెలుగు దొంగల పార్టీ ఎంపీలందరూ కలిసి దాదాపు 26 మంది ఉన్నారు. ఈ దొంగలు విపక్షాలను కలుస్తున్నారు. వాళ్లేం చేస్తారో పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తోంది. ఇది టీడీపీ- బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని’ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment